ఢిల్లీలో రేపు జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో సోమవారం సాయంత్రం సీఎం జగన్ బయలు దేరారు. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ .. ఏసి వాల్వ్ లో లీకేజీ కారణంగా ప్రైజరైజేషన్ సమస్య తలెత్తిందని గుర్తించినట్లుగా తెలిసిందని అధికారులు తెలిపారు. సమస్యను గుర్తించిన పైలట్ తిరిగి గన్నవరం విమానాశ్రయానికి మళ్లించారు.

ఢిల్లీ పర్యటన కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అధికారుల బృందం ఎక్కిన ప్రత్యేక విమానం సాయంత్రం 5.03 గంటలకు టేకాఫ్ అయ్యింది. కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్యను పైలట్ గుర్తించారు. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. తిరిగి సాయంత్రం 5.27 గంటలకు అధికారుల అనుమతితో గన్నవరంలో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. విమానం టేకాఫ్ అయిన ప్రదేశంలో కాకుండా అక్కడికి దూరంగా ల్యాండింగ్ చేయడంతో ఒక్క సారిగా సెక్యురిటీ సిబ్బంది అప్రమత్తమైంది. ఈ అనూహ్య పరిణామంతో జగన్ ఢిల్లీ పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. సీఎం జగన్ తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు.
ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రాత్రికే ఢిల్లీకి సీఎం జగన్ వెళ్లనున్నారు. విమానంలో సాంకేతిక లోపం సరిదిద్దితే ఈ రాత్రికి గానీ లేక రేపు (మంగళవారం) ఉదయం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహాక సమావేశానికి వివిధ దేశాలకు చెందిన దౌత్య వేత్తలను రేపు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సమావేశం రేపు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకూ ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ జరగనున్నది.
తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం .. బడ్జెట్‌పై లంచ్ మోషన్ పిటిషన్ ను ఉప సంహరించుకున్న సర్కార్
Bjp: ఏపిలో జగన్ సర్కార్ ను కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందా..? ఇదిగో ప్రూఫ్..!!