ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి (14వ తేదీ) నుండి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉదయం పది గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఉభయ సభలు మరుసటి రోజుకు వాయిదా పడనున్నాయి. ఆ వెంటనే శాసనసభ, శాసనమండలి వ్యవహారాల సలహా మండళ్లు (బీఎసీ) భేటీ అయి సమావేశాల అజెండాను ఖరారు చేయనున్నాయి. 13 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే బడ్జెట్ ను ఈ నెల 18వ తేదీన ప్రవేశపెట్టాలని ప్రాధమికంగా నిర్ణయించారు. కానీ 18వ తేదీకి బదులుగా ఈ నెల 17వ తేదీనే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు సమాచారం.

2023 – 24 వార్షిక బడ్జెట్ కీలకంగా మారనున్నది. వైసీపీ ప్రభుత్వానికి ఇదే పూర్తి స్థాయి చివరి బడ్జెట్ కావడంతో అందరి దృష్టి పడింది. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో సంక్షేమ పథకాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కొత్త పథకాలను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ భేటీ జరగనున్నది. గవర్నర్ ప్రసంగంతో పాటు అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులు, బడ్జెట్ కు మంత్రిమండలి ఆమోదముద్ర వేయనుంది.
ఇక ఈ ఏడాది రూ.2లక్షల 60వేల కోట్లకు పైగా బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ప్రభుత్వం తరపున 25 నుండి 30 అంశాలను వైసీపీ చర్చకు ప్రతిపాదించనున్నది. కాగా ఈ సమావేశాల్లో సీఎం జగన్ పలు అంశాలపై కీలక ప్రకటలు చేయనున్నారు. తాను విశాఖకు తరలివెళ్లే అంశంపైనా స్పష్టత ఇవ్వనున్నారు. ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో, అంతకు ముందు ఢిల్లీలో జరిగిన సన్నాహాక సదస్సులో తాను త్వరలో విశాఖకు మకాం మార్చుకుని అక్కడి నుండి పరిపాలన సాగించనున్నట్లు తెలిపిన నేపథ్యంలో ఈ అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కాగా ఈ బడ్జెట్ సమావేశాల్లో 15కు పైగా ప్రధాన ప్రజా సమస్యలకు సంబంధించి ఉభయ సభల్లో చర్చకు పట్టుబట్టాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నిర్ణయంచింది. విద్యుత్ చార్జీల పెంపు, నిరుద్యోగం, పోలవరం, రైతుల సమస్యలు, ప్రతిపక్షాల కార్యక్రమాలపై ప్రభుత్వ ఆంక్షలు, కేసులు వంటి పలు అంశాలపై చర్చ కోసం సన్నద్దమైంది.
ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ పూరైన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు..ట్విస్ట్ ఏమిటంటే..?