రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ముచ్చటగా మూడవ సారీ నోటీసులు జారీ చేశారు సీబీఐ అధికారులు. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది సీబీఐ. సీబీఐ అధికారులు పులివెందులలోని ఎంపీ ఇంటికి వెళ్లి మరీ నోటీసులు అందజేశారు. ఇంతకు ముందు ఒక పర్యాయం వాట్సాప్ ద్వారా నోటీసులు పంపిన అధికారులు ఈ సారి నేరుగా ఇంటికి వెళ్లి నోటీసులు అందజేయడం గమనార్హం. అయితే ఈ నెల 6వ తేదీ ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల విచారణకు హజరు కాలేనని ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పగా, కశ్చితంగా రావాల్సిందేనని సీబీఐ స్పష్టం చేసినట్లుగా తెలుస్తొంది.

ఇప్పటికే అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులు రెండు పర్యాయాలు విచారణ జరిపి వివేకా హత్యకు సంబంధించి పలు అంశాలపై ఆరా తీశారు. జనవరి 28న ఒక సారి, ఫిబ్రవరి 24న మరొక సారి అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అయితే రెండో సారి విచారణ జరిగిన తర్వాత అవినాష్ రెడ్డి.. సీబీఐ దర్యాప్తు తీరుపై సంచలన కామెంట్స్ చేశారు. వ్యక్తి టార్గెట్ గా దర్యాప్తు జరుగుతోందని ఆరోపించారు అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేసిన తర్వాత మరో సారి సీబీఐ ఆయనను విచారణకు పిలవడం ప్రాధాన్యతను సంతరించుకొంది. గత విచారణ పూర్తి అయిన తర్వాత తనను మరో సారి విచారణకు పిలుస్తామని చెప్పలేదని అవినాష్ రెడ్డి మీడియా వద్ద పేర్కొన్నారు. అయితే అందుకు భిన్నంగా సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డికి మరో సారి నోటీసులు జారీ చేశారు.
అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని కూడా రేపు 6వ తేదీనే కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ నందు విచారణ కు రావాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది సీబీఐ. ఇంతకు ముందు ఈ నెల 12వ తేదీ విచారణకు హజరుకావాలని పేర్కొన్న సీబీఐ.. విచారణను ప్రీపోన్ చేసింది. తండ్రీ తనయులకు ఒకే రోజు విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. రీసెంట్ గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ నేత, డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియాను విచారణకు అంటూ పిలిచి చివరకు అరెస్టు చేసింది సీబీఐ. ఇంతకు ముందు పలువురు ప్రముఖులను అదే విధంగా చేయడంతో ఈ కేసులోనూ అటువంటి పరిణామం ఏమైనా ఉంటుందా అనే దానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. చూడాలి ఏమి జరుగుతుందో.