YS Viveka Case: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వారి సహచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ లను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. వైఎస్ వివేకా హత్య కేసులో ఏప్రిల్ మూడవ వారంలో తొలుత ఉదయ్ కుమార్ రెడ్డిని ఆ తర్వాత వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం వీరు చంచల్ గూడ జైలులో ఉన్నారు. తొలుత వీరు సీబీఐ కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా సుదీర్ఘ వాదనల అనంతరం బెయిల్ మంజూరుకు సీబీఐ కోర్టు నిరాకరించింది. దీంతో వీరు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు విచారణ సందర్భంలో పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది బలంగా వాదనలు వినిపించారు.

ఈ కేసులో తమ కక్షిదారులను అన్యాయంగా ఇరికించారనీ, సీపీఐ చేస్తున్న ఆరోపణలకు సాక్షులు, సాక్ష్యాలు రెండూ లేవని వాదనలు వినిపించారు. ఈ కేసులో పిటిషనర్లు ఇప్పటికే అయిదు నెలలకుపైగా జైలులో ఉన్నారని భాస్కరరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం 72 సంవత్సరాల వయస్సు ఉన్న భాస్కరరెడ్డి ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదనీ, జైలులో ఉన్నప్పుడే అనేక వైద్య పరీక్షలు చేయించుకున్నారని కోర్టుకు తెలుపుతూ అందుకు సంబంధించిన వైద్య పరీక్షల రిపోర్టులను సమర్పించారు. ఈ కేసుకు సంబంధించి జూన్ లోనే సీబీఐ విచారణ పూర్తి చేసి చార్జి షీటు దాఖలు చేసినందున పిటిషనర్లు బెయిల్ పొందేందుకు అర్హత ఉందని కూడా నిరంజన్ రెడ్డి వాదించారు.

పిటిషన్ తరపున వాదనలు విన్న హైకోర్టు అఫిడవిట్ దాఖలు చేయగా సీబీఐ ని ఆదేశించగా, సీబీఐ అఫిడవిట్ దాఖలు చేయడంతో పాటు బెయిల్ ఇవ్వొద్దంటూ బలమైన వాదనలు వినిపించింది. నిందితులు పలుకుబడి కల్గిన వారనీ, బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, నిందితులపై అభియోగాలకు సంబంధించి సాక్ష్యాలు ఉన్నాయనీ, విచారణ ప్రస్తుతం చివరి దశలో ఉన్నందున బెయిల్ మంజూరు చేయవద్దంటూ సీబీఐ వాదనలు వినిపించింది. ఈ కేసులో సాక్ష్యులను ప్రభావితం చేయడంలో భాస్కరరెడ్డి కీలక పాత్ర పోషించారనీ, ఘటనా స్థలంలో సాక్ష్యాలను కూడా ధ్వంసం చేశారని సీబీఐ వెల్లడించింది. ఈ కేసులో రాజకీయ కుట్ర ఉందని తెలిపింది. సీబీఐ వాదనలకు ఏకీభావించిన న్యాయస్థానం వారి బెయిల్ పిటిషన్లను కొట్టేసింది.

మరో పక్క వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ డాక్టర్ సునీత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. తెలంగాణ హైకోర్టు వైఎస్ అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాల్సిన అవసరం ఉందంటూ సీబీఐ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కేసులో నిందితుడి పాత్ర, పూర్వాపరాలు మొత్తం సుప్రీం కోర్టుకు సీబీఐ నివేదించింది.

ఈ నెల 12వ తేదీన సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణకు రానున్నది. అంతకు ముందు ఈ కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను సుప్రీం కోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీం కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.