Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఉదయం రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన కడియం ఆవలో దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మీరు వస్తున్నారని ధాన్యం కొనుగోలు వేగవంతం చేశారన పవన్ కి రైతులు తెలిపారు. ఇంకా కోతలు కోయాల్సి ఉందనీ, గోనె సంచులు ఇవ్వడం లేదని రైతులు తమ గోడును పవన్ కు చెప్పుకున్నారు. నూక, ట్రాన్స్ పోర్టు పేరుతో రైతుని మిల్లర్లు దోచేస్తున్నారని పవన్ కళ్యాణ్ ముందు రైతులు కన్నీరుమున్నీరు అయ్యారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో హడావుడిగా కొనుగోలు చేసి లారీల్లో లోడ్ చేసి ఉంచిన ధాన్యాన్ని రైతులు పవన్ కు చూపించారు. అయినకాడికి ధాన్యం అమ్ముకునే పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం వేమగిరి, జొన్నాడ, రావులపాలెం, కొత్తపేట మీదుగా అవిడి చేరుకుని నష్టపోయిన రైతులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తదుపరి పి గన్నవరం నియోజకవర్గం రాజుపాలెం ప్రాంతంలో రైతులతో మాట్లాడారు. రైతుల కష్టాలను ఓపికగా ఆలకించిన పవన్ కళ్యాణ్.. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసే వరకూ జనసేన పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
YSRCP: జనసేన, బీజేపీలకు షాక్ .. ఇద్దరు నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక
