విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ లో ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు కేశినేని చిన్ని మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సిగ్మెంట్ లలో పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ చిన్ని రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటుండటంతో టీడీపీలో ఎంపీ కేశినేని నాని అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పరిస్థితి తయారైంది. అయితే ఎటువంటి మోహమాటం లేకుండా తన మనసులోని మాటలు బయటపెడుతూ సంచలన కామెంట్స్ చేసే ఎంపీ కేశినేని నాని.. మరో మారు ప్రస్తుత రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ పోటీ చేసే అవకాశం ఉందనీ, సీటు ఆశించవచ్చని నాని అన్నారు. గాంధీ వంటి వాళ్లైనా, దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్ వంటి నేరస్తులు వారు పోటీ చేసే అవకాశం ఉందన్నారు. 420లు, కాల్ మనీ వ్యాపారులు, ఉమనైజర్లు కూడా ప్రస్తుత రాజకీయాల్లో భాగమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వాళ్లకు మాత్రం టికెట్లు ఇవ్వరాదని అన్నారు. తెలుగుదేశం పార్టీని గొప్ప ఆశయాలు, సిద్దాంతాలతో నందమూరి తారక రామారావు ప్రారంభించారన్నారు. టికెట్లు ఇచ్చే విషయంలో గాంధీకి ఇవ్వొచ్చు, మాఫియా డాన్ లాంటి వాళ్లకు ఇవ్వొచ్చు. పార్టీ స్టాండ్ ను బట్టి, అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఉంటుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో నీతి పరులు, అవినీతి పరులు అందరూ ఉంటారని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది నీతిగా రాజకీయాలు చేయాలనేననీ, అవినీతి పరులను తన వెనకాల వేసుకుని తిరగననీ, అలాంటి వాళ్లను ఆమడ దూరంలో పెడతానన్నారు.
కేశినేని చిన్ని కి సీటు ఇస్తే మీరు సహకరిస్తారా అని మీడియా ప్రశ్నించగా, తాను చచ్చినా మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు. చిన్నియే కాదు కొంత మంది మనుషులు ఉన్నారు వాళ్లకు కూడా తాను ఏ మాత్రం మద్దతు ఇవ్వనని తెలిపారు. మంచి వాళ్లకు టికెట్ ఇస్తే ఎంపిగా గెలిపించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఎంపీ అియితేనే తనకు ఈ స్థాయి రాలేదనీ, తనకు ఎప్పటి నుండో బ్రాండింగ్ ఉందని కేశినేేని నాని పేర్కొన్నారు. తన సేవలు అవసరం అనుకుంటే పార్టీ వాడుకోవచ్చని అన్నారు. తెలుగుదేశం పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. తమ పార్టీ అధినేత ముఖ్యమంత్రి అవ్వాలి, అట్లానే పార్టీ కూడా బలోపేతం కావాలన్నదే తమ కోరిక అని, పార్టీని అమ్ముకునే వారికంటే నమ్ముకున్న వారికి పార్టీ బాధ్యతలను అప్పచెప్పాలని కేశినేని నాని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి వచ్చిన సందర్భంలో నాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నాని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం అయ్యాయి. వైసీపీ సోషల్ మీడియా కూడా ఈ వ్యాఖ్యలను హైలెట్ చేస్తొంది. నాని వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన ప్రకటన .. రాజకీయాలకు ఇక రామ్ రామ్