RGV OTT Spark: తెలుగు న్యూస్ ఛానెళ్లలో ఎక్కువ తిట్లు కాసేది టీవీ 9 .. కానీ చూసేది కూడా ఆ ఛానెల్ నే..!
తెలుగు హీరోల్లో ఎక్కువగా తిట్టేది బాలకృష్ణని.. కానీ చూసేది కూడా అతని సినిమాలనే..!
తెలుగు డైరెక్టర్లలో ఎక్కువగా తిట్టుకునేది రామ్ గోపాల్ వర్మనే.. కానీ చూసేది కూడా ఆయన సినిమాలనే..!
అది మనిషి నేచర్. అది మనిషి అలవాటు. వారిలో ఉన్న ప్రతిభ, గత చరిత్ర కూడా ఆ అలవాటుకి కారణం..! టీవీ 9 ఒకప్పుడు మెరిపించింది. అద్భుతమైన కథనాలతో గ్రామాలకు పాకింది. ఇప్పుడు డబ్బులకు రుసిమరిగింది.. అలాగే బాలకృష్ణ ఒకప్పుడు దుమ్ము రేపారు. ఆయన సినిమాలన్నా.. ఆయన డైలాగులన్నా.. ఆయన నటన అన్నా అన్నివర్గాల వారూ పడిచచ్చే వారు..! అదే కోవలోకి రామ్ గోపాల్ వర్మ కూడా వస్తారు. తెలుగు మాత్రమే కాదు ఇండియన్ సినిమాలోనే వర్మ అంటే ఒక చరిత్ర. ఒక ముద్ర. ఒక ప్రతిభ. ఒక వైరస్. అతను ఎవరికైనా అర్ధమయితే వదులుకోలేరు. అయితే ప్రతిభ కంటే అతనిలో ఒకరకమైన పైత్యం వర్మని కొంచెం దిగజార్చింది. కానీ టేకింగ్, సినీ మేకింగ్ లో వర్మ అంటే తిరుగులేని ధీరుడే..! అటువంటి రామ్ గోపాల్ వర్మ సినిమా అంటేనే భయంతో, తిట్టుకుంటూ చూసుకుంటే తన అభిమానుల కోసం వర్మ ఓ ఓటీటీలోకి వచ్చేస్తున్నారు.

RGV OTT Spark: 15 నుండీ వస్తుంది.. జాగ్రత్త సుమీ..!!
కరోనా నేపథ్యంలో థియేటర్లుకి రోజులు బాలేవు. వర్మకి సినిమాలు తీయకపోతే మైండ్ పనిచేయదు. సినిమాలో, సగం బూతు బొమ్మలో, దెయ్యం కథలో తన కోసమే ఉన్న అభిమానుల కోసం వదలకపోతే వర్మ ఆగలేరు. అందుకే ఆయన ఓటీటీలోకి వచ్చేస్తున్నారు. ఈ నెల 15 నుండి రామ్ గోపాల్ వర్మ.. సాగర్ అనే వ్యాపారవేత్తతో కలిసి రూపొందించిన “స్పార్క్” ఓటీటీ రాబోతుంది. ఇప్పటికే లోగో లాంచింగ్, పరిచయం అన్నీ జరిగిపోయాయి. సినీ సెలెబ్రిటీలు చాలా మంది శుభాకాంక్షలు కూడా తెలియజేసారు. వర్మ దర్శకత్వం వహించిన “డీ కంపెనీ” అనే సినిమా ఆరోజు విడుదల కాబోతుంది. సగం భయం, సగం బూతు, సగం శాడిజం, సగం పైత్యం, చత్వారం, నవ్వు లేని కామెడీ, ఓ వర్గానికి ఎక్కే ఫ్యాక్షన్ ఇవన్నీ కలిపి చూసేయడానికి ఈ నెల 15 నుండీ సిద్ధమైపొండి..!
చివరిగా కొసమెరుపు ఏమిటంటే.. దీనిలో ఆర్జీవీ ఎంత మేరకు స్థిరంగా ఉంటారు..? ఎంత మేరకు తన సత్త చూపుతారు..!? తనే స్వయంగా సినిమాలు తీస్తారా.!? లేదా తన అసిస్టెంట్లు చేత తీయిస్తారా..!? కొన్నేళ్లుగా వస్తున్నా ఆర్జీవీ సినిమాల్లాగే ఉంటె ఇది ఎన్నాళ్ళు నిలబడగలుగుతుంది అనే అనేక సందేహాలు సగటు జీవిలో మెదలడం సహజమే..!