Family Star: గత వారం థియేటర్స్ లో విడుదలైన తెలుగు చిత్రాల్లో ఫ్యామిలీ స్టార్ ఒకటి. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా ప్రముఖ దర్శకుడు పరశురామ్ పెట్లా తెరకెక్కించిన అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాలో అందాల భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. జగపతిబాబు, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, అభినయ, వాసు, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలను పోషించగా.. గోపి సుందర్ మ్యూజిక్ అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది.
విడుదలకు ముందు టీజర్, ట్రైలర్, సాంగ్స్ మరియు ప్రమోషన్స్ తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. కానీ విడుదల తర్వాత ప్రేక్షకుల అంచనాలను ఫ్యామిలీ స్టార్ ఏ మాత్రం అందుకోలేకపోయింది. రొటీన్ స్టోరీని పరశురామ్ అంతే రొటీన్ గా తెరకెక్కించాడంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కనీసం అభిమానులను కూడా ఫ్యామిలీ స్టార్ మూవీ మెప్పించలేకపోయింది. హాలిడేస్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ.. టాక్ అనుకూలంగా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్స్ యావరేజ్ గా సాగుతున్నాయి.
కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉండటంతో ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ దిశగా దూసుకెళ్తోంది. తాజాగా ఈ సినిమా 4 రోజుల వసూళ్లు లెక్క బయటకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 3.85 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. రెండో రోజు రూ. 1.55 కోట్లు, మూడో రోజు రూ. 1.28 కోట్లు రాబట్టింది. నాలుగో రోజు కేవలం రూ. 45 లక్షలతో సరిపెట్టుకుంది. మొత్తంగా నాలుగు రోజుల్లో రూ. 7.13 కోట్ల షేర్, రూ. 12.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను ఈ సినిమా సాధించింది.
ఏరియాల వారీగా చూసుకుంటే నైజాం లో రూ. 3.64 కోట్లు, సీడెడ్ లో రూ. 70 లక్షలు, ఉత్తరాంద్రలో రూ. 77 లక్షలు, తూర్పు గోదావరిలో రూ. 43 లక్షలు, పశ్చిమ గోదావరిలో రూ. 36 లక్షలు, గుంటూరులో రూ. 46 లక్షలు, కృష్ణలో రూ. 40 లక్షలు మరియు నెల్లూరులో రూ. 37 లక్షలు వసూళ్లను ఫ్యామిలీ స్టార్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా నాలుగు రోజుల వసూళ్లను పరిశీలిస్తే.. ఈ సినిమాకు రూ. 12.57 కోట్ల షేర్, రూ. 23.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
ఫ్యామిలీ స్టార్ మూవీకి రూ. 43 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా.. రూ. 44 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు కేవలం రూ. 12.57 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా ఈ చిత్రం రూ. 31.43 కోట్ల రేంజ్ లో షేర్ వసూళ్లను అందుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ రేంజ్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు. పైగా రెండు వారాల క్రితం వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీనే ఫ్యామిలీ స్టార్ కంటే ఎక్కువ కలెక్షన్స్ ను రాబడుతోంది.