Kiran Abbavaram: టాలీవుడ్ హీరోలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలెక్కేస్తున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. తమ సింగిల్ లైఫ్‌కు ఎండ్ కార్డు వేస్తూ ప్రముఖ హీరోయిన్ తో మింగిల్ అవ్వబోతున్నాడు. ఏపీలోని రాయచోటిలో పుట్టి పెరిగిన కిరణ్ అబ్బవరం.. నటనపై ఆసక్తి ఉన్నప్పటికీ నెట్వర్క్ కన్సల్టెంట్ గా కెరీర్ ప్రారంభించాడు. బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో ఉద్యోగం చేశాడు. కానీ చేస్తున్న ఉద్యోగం ఏమాత్రం సంతృప్తిని ఇవ్వలేదు.
దాంతో ఉద్యోగం మానేసి ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా నటుడిగా మారిన కిరణ్ అబ్బవరం.. 2019లో వచ్చిన రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రవికిరణ్ డైరెక్టర్ చేసిన ఈ రొమాంటిక్ డ్రామా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా కిరణ్ అబ్బవరం ప్రొఫెషన్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ ను కూడా సెట్ చేసింది. ఈ చిత్రంలో తనకు జోడిగా నటించిన రహస్య గోరక్‌తో కిరణ్ ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు ఆమెతోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నాడు.
చాలా రోజుల నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పలుమార్లు వార్తలు వచ్చాయి. కానీ వారు మాత్రం తమ రిలేషన్‌ను బయట పెట్టలేదు. అయితే ఎప్పటికప్పుడు తాము లవ్ లో ఉన్నట్టు హిట్స్ ఇస్తూనే వచ్చారు. ఇక ఇప్పుడు ఈ జంట ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా మార్చి 17న కిరణ్ అబ్బవరం, రహస్య నిశ్చితార్థం చేసుకోబోతున్నారు.
ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక కిరణ్ అమ్మవరం కెరీర్ విషయానికి వస్తే.. రాజావారు రాణి గారు తర్వాత హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. తనదైన నటన శైలి మరియు ప్రత్యేకమైన యాసతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. చివరిగా రూల్స్ రంజన్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.