మధ్యప్రదేశ్ లో ఆదివాసీ యువకుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనలో నిందితుడైన ప్రవేశ్ శుక్లాను అరెస్టు చేయడంతో పాటు ప్రభుత్వం అతని ఇంటిని కుల్చివేసింది. తాజాగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బాధితుడి కాళ్లు కడిగి క్షమాపణలు చెప్పారు. భోపాల్ లోని తన నివాసానికి బాధితుడిని పిలుపించుకున్న సీఎం చౌహాన్..అతని పరామర్శించి స్వయంగా అతని కాళ్లు కడిగి క్షమాపణలు తెలియజేశారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని అన్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో తనను చాలా బాధించిందన్నారు. ఈ విషయమై క్షమాపణలు కోరుతున్నానన్నారు.

ప్రజలు తనకు దేవుడితో సమానమని తెలిపారు సీఎం చౌహాన్. ఈ తరహా దుశ్చర్యలు సహించేది లేదని అన్నారు. సిదీ జిల్లాలో జరిగి ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై రాష్ట్రంలో రాజకీయ వివాదం నెలకొంది. నిందితుడికి బీజేపీతో సంబంధం ఉందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించగా, ఆ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఘటన వెలుగు చూసిన వెంటనే దోషిని అరెస్టు చేసి జాతీయ భద్రతా చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చౌహాన్ అధికారులను ఆదేశించారు. ఈ ఘటన మానవతకు సిగ్గుచేటని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. బీజేపీ విద్వేష సంస్కృతికి ఇది అద్దం పడుతోందని విమర్శించారు.ఈ ఘటనను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి.
Rain alert: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక