గులాబీ పూయని చోట కమలం వికసించే : ఓల్డ్ సిటీలోకి చొచ్చుకెళ్లిన బీజేపీ

 

 

హైదరాబాద్ ఓల్డ్ సిటీ అనగానే అత్తరు… గాజులు.. బిర్యాని… చార్మినార్ తో పాటు ఎంఐఎం పార్టీ ఓవైసి సామ్రాజ్యం గుర్తు వస్తుంది… హైదరాబాద్ పాతబస్తీ లోని 7 అసెంబ్లీ సీట్లు, హైదరాబాద్ ఎంపీ సీట్ ఎప్పుడు మజ్లిస్ పార్టీవే. ఎన్ని ఎత్తులు వేసిన, మరిన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని దశాబ్దాలుగా పాతబస్తీ లోపలకి ఏ పార్టీ ప్రవేశించలేకపోయింది. ఎంతో మంది మంత్రులు ముఖ్యమంత్రులు, మరెందరో కేంద్రమంత్రులు పాతబస్తీ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు మజ్లిస్ పార్టీని నిర్వీర్యం చేసేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఓవైసీ లు ఇక్కడ ఏం చెప్తే అదే జరుగుతుంది. కనీసం ప్రచారానికి వెళ్లకుండానే గాలిపటం ఎలా ఎగురుతుంది. అలాంటి కీలకమైన పాతబస్తీ కోటలను ఇప్పుడు బిజెపి బద్దలు కొట్టింది. పూర్తిగా రాజ్యం లోపలికి వెళ్లకపోయినా, అక్కడ తన బృందంతో పాగా వేయగలిగింది.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో గతంలో వచ్చినట్లే మజ్లిస్ కు 44 సీట్లు వచ్చాయి. తెరాస కు 99 నుంచి 55 కి దిగజారితే, గత ఎన్నికల్లో 4 సీట్లకే పరిమితం అయిన బీజేపీ మాత్రం ఏకంగా 44 సీట్లు ఎక్కువ సాధించి మొత్తం 48 సీట్లు సాధించింది. వీటిలో ఓల్డ్ సిటీలో కొన్ని కీలక స్థానాల్లో బీజేపీ ఖాతా తెరిచింది. గతంలో ఎంఐఎం బలంగా ఉన్న చోట్ల కమలం వికసించింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది.

హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో…

దాదాపు ఓల్డ్ సిటీ అంతా హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఉన్న 7 అసెంబ్లీ నియోజక వర్గాలు మజ్లిస్ పార్టీకి కంచుకోట. ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 44 సీట్లు ఉంటే దానిలో మజ్లిస్ 33 స్థానాల్లో జయకేతానం ఎగురవేస్తే కమలం పార్టీ 11 స్థానాల్లో సత్తా చాటింది. అంతే కాదు ఎన్నో డివిజన్ లలో మంచి వోటింగ్ శాతన్ని నమోదు చేసింది. ఎంఐఎం గెలిచిన స్థానాల్లో 10 చోట్ల బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. పాతబస్తీలో గతంలో ఉన్న సంప్రదాయ ఓటింగ్ ను బిజెపి చీల్చింది.

ఎందుకీ మార్పు

పాతబస్తీ ప్రాంతాల్లో ముస్లింలు 77 శాతం ఉంటే, హిందువులు 17 శాతం ఉన్నారు. వీరిని ఆకర్షించడంలో బిజెపి విజయవంతమైంది. ఎన్నికలకు ముందు బిజెపి జాతీయ నాయకుల ప్రచారం దీనికి మంచి మైలేజ్ ఇచ్చింది. దీంతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కొన్ని ఘాటు వ్యాఖ్యలు హిందువుల ధైర్యాన్ని పెంచాయి. ఖచ్చితంగా హిందువులకు అండగా బిజెపి ఉంటుందనే భావన తీసుకెళ్లడంలో నాయకులు విజయం సాధించారు. దీంతోనే మైనారిటీలుగా పాత బస్తీలో ఉన్న హిందువులంతా బిజెపి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి భరోసా ను గతంలో ఏ పార్టీ ఇవ్వకపోవడంతో వీరంత ఎప్పుడు గాలిపటం వైపే చూసేవారు. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని బిజెపి తిప్పినట్లు అయ్యింది.

తెరాస కు చెమటలే

గతంలో ఉన్న బిజెపి వేరు ఇప్పుడు చూస్తున్న బీజేపీ వేరు. ఇదే పద్ధతి కనుక కొనసాగితే బీజేపీతో అధికార తెరాసకు చిక్కులు తప్పవు. ప్రస్తుత ఎన్నికల ఫలితాలను బట్టి అధికార పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లేందుకు కొందరు నాయకులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ నాయకుల వాయిస్ తెరాస కు దీటుగా బలంగా ప్రజల్లోకి వెళుతుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బండి సంజయ్ మంచి దూకుడు మీద ఉన్నారు. ఆయనకు నిజామాబాద్ ఎంపీ అరవింద్ తోపాటు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, దుబ్బాక ఎన్నికల్లో గెలిచిన రఘునందన్ వాయిస్ గనుక కలిస్తే బీజేపీ నాయకుల వాయిస్ ను తెలంగాణ ప్రజలు తప్పకుండా వింటారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించడంలో, తెలంగాణ యాసను భాషను ఏపీ ప్రయోగించడంలో ఈ నాయకులకు మంచి పట్టు ఉండడం కూడా బిజెపికి కలిసి వస్తోంది. ఇక పాత నగరంలో బిజెపి క్రమంగా బలం పుంజుకుంటే మజ్లిస్ పార్టీ లోనే చీలికలు తెచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ దాటి వేర్వేరు రాష్ట్రాల్లో మజ్లిస్ పార్టీ పోటీకి సై అంటోంది. ఇటీవల బీహార్ ఎన్నికల్లో కూడా నాలుగు అసెంబ్లీ సీట్లు సాధించగలిగింది. మరోవైపు వచ్చే ఏడాది జరగనున్న పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో సైతం మజ్లిస్ పార్టీ పోటీకి రంగం సిద్ధం చేసుకుంటోంది. మజిలీ హైదరాబాద్ వేదికగా దేశమంతటా పోటీకి దిగుతూ ముస్లింలను ఐక్యత చేసే వేదికగా మారింది. దీన్ని బీజేపీ గుర్తించింది. మజిల్స్ ను బలహీన పరచాలి అంటే మొదట పాతబస్తీ నే వేదికగా చేసుకోవాలని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. అందుకే హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించిన బిజెపి అధినాయకత్వం ఏమీ అనకుండా మిన్నకుండి ఉంది. పాతబస్తీలో ఎలాగైనా ప్రాబల్యం పెంచుకుంటే మజ్లిస్ పార్టీకి ఇప్పటికే ఉన్న అదే ముస్లిం వర్గానికి చెందిన శత్రువులను ప్రోత్సహించినా మజ్లీస్ పార్టీ లో చీలికలు తీస్తే వారి దూకుడును అడ్డుకట్ట వేయొచ్చు అనేది బిజెపి అసలు లక్ష్యం.