Konijeti Rosaiah: కొణిజేటి రోశయ్యకు రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక్క ప్రియ శిష్యుడు!ఎవరాయన? ఏమా కథ?

Share

Konijeti Rosaiah: రాజకీయ దురంధరుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కుటుంబ సభ్యులెవ్వరూ రాజకీయాల్లో లేరు. కాంగ్రెస్ లో ఎన్నో ఉన్నత పదవులు రోశయ్య అధిష్ఠించినా ఆయనకంటూ ఒక గ్రూపు కూడా ఉండేది కాదు.ఇంకా చెప్పాలంటే రోశయ్య ఆ తరహా రాజకీయాలకు దూరం.

Konijeti Rosaiah's only beloved disciple in the entire state!
Konijeti Rosaiah’s only beloved disciple in the entire state!

పెద్దగా ఎవరినీ దగ్గరకు చేరనిచ్చేవారు కాదు.కానీ ఆ పెద్దాయనకు కూడా రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక ప్రియశిష్యుడున్నాడు.ఆయన చేత రాజకీయ ఓనమాలు దిద్దించి అసెంబ్లీ వరకూ రప్పించింది రోశయ్య అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు.ఆ అదృష్టవంతుడే చీరాల మాజీ ఎమ్మెల్యే,ప్రస్తుత నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జి ఆమంచి కృష్ణమోహన్.అందుకే రోశయ్య మృతి వార్త ఆయన కుటుంబ సభ్యులనే కాకుండా చీరాల మాజీ ఎమ్మెల్యే,నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ ఆమంచి కృష్ణమోహన్ ను కూడా శోక సంద్రంలో ముంచెత్తింది.ఈ వార్త తెలియగానే ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు

రోశయ్య డిస్కవరీ ఆమంచి!

ఆమంచి కృష్ణమోహన్ రాజకీయరంగ ఆరంగేట్రానికి,ఆయన అసెంబ్లీలో అడుగిడడానికి కొణిజేటి రోశయ్య బాట వేశారు. 1967 నుండి చీరాల నియోజకవర్గంతో మమేకమై పని చేస్తున్న రోశయ్య తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఈ నియోజకవర్గంలో నాయకత్వ లక్షణాలు ఎవరికి ఉన్నాయో బూతద్దంలో చూసి ఆమంచి ఇందుకు అర్హుడని నిర్ణయానికి వచ్చి ఆయనను ప్రోత్సహించడం ప్రారంభించారు.ఆమంచి కూడా రోశయ్య అడుగుజాడల్లో నడుస్తూ ఆయనలోని రాజకీయ మెళకువలను కూడా అలవర్చుకున్నారు.

కాంగ్రెస్ టిక్కెట్ ఇప్పిచ్చిందీ ఆయనే!

ఆమంచి 2000 సంవత్సరంలో జెడ్పీటీసీ అయినా, ఆ తదుపరి వేటపాలెం ఎంపీపీ అయినా అదంతా రోశయ్య డైరెక్షన్ లోనే జరిగింది.ఇక డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సూచన మేరకు శాసనమండలికి వెళ్లిపోయి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో రోశయ్యచీరాల నుండి పోటీ చేయకపోవడంతో కాంగ్రెస్ టిక్కెట్ కు ఎక్కడాలేని డిమాండ్ ఏర్పడింది.హేమా హేమీలు పోటీపడ్డా ఆమంచి కృష్ణమోహన్ కు డాక్టర్ వైఎస్ఆర్ చీరాల టిక్కెట్ ఇచ్చారంటే అది ఆయనకు ఆత్మీయుడైన రోశయ్య సిఫార్సని వేరుగా చెప్పనక్కర్లేదు.ఆ ఎన్నికల్లో పది వేల ఓట్ల మెజారిటీతో గెలిచి ఆమంచి రోశయ్యకు గురుదక్షిణ చెల్లించుకున్నారు.ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలిసినవే.

ఆ మంచికి కూడా అన్నీ ఆయనే!

ఇంకా చెప్పాలంటే ఆమంచి కృష్ణమోహన్ రోశయ్య తన కుటుంబసభ్యునిగా చూసేవారు. ఇక కృష్ణమోహన్ కైతే రోశయ్యే ఆరాధ్యదైవం.ఆయన మీద ఆమంచి ఈగవాలనిచ్చే వారు కాదు. ఆమంచి ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా రోశయ్య సలహా పొందే వారు.ఇంతటి అవినాభావ సంబంధం ఉన్నందునే ఆమంచి కృష్ణమోహన్ “పెద్దాయన” రోశయ్య మరణవార్త విని దిగ్భ్రాంతికి గురయ్యారు.తీవ్రంగా కలత చెందిన కృష్ణమోహన్,తనకు పితృసమానుడైన రోశయ్యకు అంతిమ వీడ్కోలు పలికేందుకు ఆవేదనా భరిత హృదయంతో హైదరాబాద్ వెళ్ళారు.

 


Share

Related posts

అదండీ అసలు సంగతి ! ఏమయ్యేను ఆంధ్రప్రదేశ్ గతి ?

Yandamuri

పల్నాడు గనుల కేసు సిబిఐకి

somaraju sharma

బాబుగారి ఆదేశాలతో టీడీపీ నేతల్లో భయం.. భయం!

Yandamuri