కరోనా కల్లోలం లేకుండా ఉండి ఉంటే.. ఈఏడాది జూలై 30న అద్భుతాలు జరిగేవే. కనీసం.. కరోనా తీవ్రత ఈస్థాయిలో లేకపోయినా.. 2021 సంక్రాంతికి జనవరి 8న అయినా ఆ అద్భుతం సాక్షాత్కారమయ్యేదే. ఇంతకీ అదేంటంటే.. యావత్ భారత సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమానే ఆ అద్బుతం. కరోనా కల్లోల పరిస్థితుల్లో షూటింగ్ ఆలస్యం కావడంతో ఇందుకు కాస్త ఆలస్యం అయింది. సినిమా విడుదల ఎప్పుడనేది ఇతిమిద్ధంగా తెలీనప్పటికీ ఈ సినిమా రేకెత్తిస్తున్న ఆసక్తి చాలా ఎక్కువ. దీంతో సినిమాగా రికార్డులు నెలకొల్పాల్సింది.. ప్రస్తుతానికి ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్న రామ్ చరణ్, ఎన్టీఆర్ లపై రిలీజ్ చేసిన టీజర్లు సృష్టిస్తున్నాయి.
సినిమాలో ఇద్దరు హీరోల్లో ఒకరిగా నటిస్తున్న ఎన్టీఆర్ పోషిస్తున్న కొమరం భీమ్ పాత్రపై అక్టోబర్ 22న టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో ఎన్టీఆర్ పాత్ర, ఆహార్యంతో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేశాడు. పాత్రలో తన వేరియేషన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ టీజర్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 32 మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తూ తెలుగులో తొలి సారిగా 1.1 మిలియన్ లైక్స్ సాధించింది. ఇదొక రికార్డు. దీంతోపాటు 200k కామెంట్స్ కూడా రావడం ఓ రికార్డు. ఈ టీజర్ కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అయితే.. ఈ టీజర్ కాస్త వివాదాస్పదం అయింది.
అంతకుముందు మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కోర మీసంతో రామ్ చరణ్ తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశాడు. టీజర్ లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇప్పటివరకూ యూట్యూబ్ లో వ్యూస్ పరంగా 33 మిలియన్ల మార్కు దాటి రికార్డు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. చరణ్ ఆహార్యం, పాత్ర తీరుతెన్నులు మెగా అభిమానులు, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ టీజర్లతో సినిమా ఎలా ఉండబోతోందో ఓ అంచానాకు వచ్చినట్టైంది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!