Heavy Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేస్తొంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది.

దీని కారణంగా ఏపీతో పాటు కేరళ, లక్షద్వీప్, మహీ, తమిళనాడు, పుదుచ్చేరి సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మరో వైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. దీని వల్ల మంగళ, బుధవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలోని ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, పలు చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
మంగళవారం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరిక జారీ చేశారు. అలాగే అస్సాం, మేఖాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఈ నెల 17,18 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.