ప‌వ‌న్ క‌ళ్యాణ్ …. ఆట‌లో అరటి పండు అయిపోతున్నారా?

జ‌న‌సేన , బీజేపీ రాజ‌కీయంపై కొత్త చ‌ర్చ జ‌రుగుతోంది . ఏపీ రాజకీయ పార్టీలు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలపై పెట్టాయి. ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ రాకముందే… ప్రజలకు పార్టీలు దగ్గర అవుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే వైసీపీ, తెలుగుదేశం పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. అటు బీజేపీ కూడా పోటీకి సిద్ధమని తెలిపింది.

అయితే.. తాజాగా తిరుపతి ఉప ఎన్నికల బరిలో “జనసేన” ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ ఎత్తుగడలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్లిన జనసేనాని.. ఆ సీటు తమకు కేటాయించాల్సిందిగా బీజేపీ అధిష్టానాన్ని కోరే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.

బీజేపీ కొత్త లెక్క‌లు…

తిరుప‌తి ఉప ఎన్నిక‌పై బీజేపీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర ఎత్తుగ‌డ‌లు జరుగుతున్నాయి. బీజేపీ, జనసేన సంయుక్త కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నాయి. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఈ ఎన్నిక‌పై స్పందిస్తూ, తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందా? జనసేన పోటీ చేస్తుందా? అనే విషయంలో.. త్వరలోనే క్లారిటీ వస్తుందని సోము వీర్రాజు అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పి. నడ్డాతో పవన్ కల్యాణ్ ముఖాముఖి చర్చలు జరుప‌నున్నారని తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ పెద్దలతో చర్చిస్తున్నారని… ఆ తర్వాత అభ్యర్థి విషయంలో స్పష్టత వస్తుందని సోము వీర్రాజు అన్నారు. తిరుపతి అభివృద్ధికి కేంద్రం అధిక ప్రాధాన్య మిస్తోందన్నారు . ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు సాధించే వరకు విశ్రాంతి వద్దని సోము వీర్రాజు అన్నారు.

రోజా సంచ‌ల‌న కామెంట్లు …

ఓవైపు గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీకి జనసేన సంపూర్ణ మద్దతు తెలపడం…ఆ వెంటనే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే ఆర్కే రోజా ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్ అమ్ముడుపోయి తిరుపతి సీటు కోసం ఢిల్లీలో కూర్చున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ ఉనికే లేదని వ్యాఖ్యానించిన రోజా ఎవ్వరు ఎన్ని కుట్రలు పన్నినా తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.

ప‌వ‌న్ మ‌ళ్లీ ….

గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన జనసేన.. అభ్యర్థుల జాబితా కూడా సిద్ధం చేసుకుంది. చివరి క్షణాల్లో బీజేపీ నేతలు ఆయనను కలిసి మద్దతు తెలపాల్సిందిగా కోరడంతో జనసేన పోటీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. తిరుప‌తిలో కూడా ఇలాంటి ప‌రిస్థితి ఎదురుకానుందా? జ‌న‌సేనాని ఢిల్లీలో ఉప‌సంహ‌ర‌ణ ప్ర‌క‌ట‌న చేస్తారా? అంటూ ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.