YS Jagan: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం తొలి నుండి టీడీపీకి కంచుకోట. ఇక్కడి నుండి టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పోటీ చేసి వరుసగా 1985 నుండి 1994 వరకూ మూడు సార్లు గెలవడంతో పాటు నందమూరి వారసుడు హరికృష్ణ, ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ ఇక్కడ విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా బాలకృష్ణ విజయం సాధిస్తూ వచ్చారు. 1983 లో టీడీపీ ఆవిర్భావం నుండి హిందూపురం ప్రజలు టీడీపీ అభ్యర్ధులనే గెలిపిస్తూ వస్తున్నారు.

హిందూపూరం నియోజకవర్గంలో అభ్యర్ధుల గెలుపు ఓటములకు ముస్లిం, బీసీ సామాజిక వర్గం చాలా కీలకం. దాదాపు 60 వేల ముస్లిం సామాజిక వర్గ ఓట్లు ఉండగా, 90 వేలకు పైగా బీసీలు ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో టీడీపీ హవాకు అడ్డుకట్ట వేయడం కోసం గత ఎన్నికల్లో వైసీపీ ముస్లిం కార్డు ప్రయోగించింది. ఎండీ ఇక్బాల్ ను గత ఎన్నికల్లో పోటీ నిలపినా బాలయ్య మీద వర్క్ అవుట్ కాలేదు. దీంతో ఈ సారి బీసీ ప్లస్ రెడ్డి సామాజికవర్గంతో పాటు మహిళా సెంటిమెంట్ ను బాలకృష్ణపై ప్రయోగానికి జగన్ సిద్దమైయ్యారు. ఈ క్రమంలో ఇటీవల నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జిగా ఉన్న ఎమ్మెల్సీ ఇక్బాల్ ను తప్పించి ఆయన స్థానంలో దీపిక రెడ్డి కి ఇన్ చార్జి పగ్గాలు అప్పగించింది వైసీపీ.

దీపిక బీసీ మహిళ కాగా ఆమె భర్తది రెడ్డి సామాజికవర్గం. వైసీపీ మాజీ సమన్వయకర్త, అగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్, ఎమ్మెల్సీ ఇక్బాల్ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దమవుతూ గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమ జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రూపు ఇక్కడి రాజకీయాలకు చెక్ పెట్టేందుకు దీపిక రెడ్డిని రంగంలోకి దింపారుట. రామచంద్రారెడ్డి ప్రతిపాదనకు జగన్ ఆమోదముద్ర వేశారు. దీంతో ఆమె చురుగ్గా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకూ మహిళా అభ్యర్ధులు ఎవరూ పోటీ చేయలేదు. ఏ రాజకీయ పార్టీ కూడా ఓ మహిళా నాయకురాలిని తమ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో దింపలేదు.

అయితే అభ్యర్ధిత్వం ఆశించి ఎమ్మెల్సీ ఇక్బాల్ భంగపడ్డారు. దీంతో ఇక్బాల్ వర్గం దీపికకు సహకరించేది లేదని అంటున్నారుట. లోపాయికారిగా బాలకృష్ణకు సహకరించే పరిస్థితి ఉందని టాక్. మరో పక్క నవీన్ నిశ్చల్ వర్గం గత ఎన్నికల్లో ఇక్బాల్ కు సహకరించలేదని అందుకే ఇక్బాల్ ఓటమి పాలయ్యారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు దీపకకు నవీన్ నిశ్చల్ సహకరిస్తారా..? లేదా అనేది కీలకంగా మారింది.

హిందూపూరం లో నవీన్ నిశ్చల్, ఇక్బాల్ వర్గం అసంతృప్తిని విడనాడి దీపికకు మద్దతు పలికి హార్ట్ ఫుల్ గా పని చేస్తే నందమూరి బాలకృష్ణపై గెలుపు ఖాయమనే భావన వైసీపీలో ఉంది. అందుకే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలోకి దిగి నవీన్ నిశ్చల్, ఇక్బాల్ వర్గంతో సమావేశాలు నిర్వహిస్తూ దీపిక విజయానికి కృషి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారుట. బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో సీఎం జగన్ స్కెచ్ వర్క్ అవుట్ అయితే టీడీపీ ఓటమి ఖాయమనే మాట వినబడుతోంది. చూడాలి ఎమి జరుగుతుందో..!