మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి (70) అలియాస్ సంగ్రామ్ (సాయన్న) అనారోగ్యంతో కన్నుమూశారు. దండకారణ్యంలో ఆయన మృతి చెందినట్లు పేర్కొంటూ మావోయిస్టులు సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మండలానికి రాజిరెడ్డి తొలి తరం మావోయిస్టు నేతల్లో ఒకరు. నాలుగున్నర దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడుగా కొనసాగుతున్నారు రాజిరెడ్డి. 1975 లో ఇంటర్ చదువుతున్న సమయంలోనే ఆర్ఎస్ యూలో చేరారు. అప్పుడే కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితుడయ్యారు రాజిరెడ్డి. వివాహమై ఒక కూరుతు జన్మించిన తర్వాత 1977లో అజ్ఞాతంలోకి వెళ్లి అప్పటి పీపుల్స్ వార్ లో చేరారు.

మంథని, మహదేవ్ పూర్ ఏరియా దళంలో పని చేసి కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ లతో కూడిన మావోయిస్టుల నైరుతి ప్రాంతీయ బ్యూరోలో విప్లవాత్మక ఉద్యమానికి ఇన్ చార్జిగా ఆయన పని చేశారు. రాజిరెడ్డిపై దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కేసులు ఉండగా, వివిధ రాష్ట్రాల్లో ఆయనపై కోటి రూపాయల రివార్డు ఉంది. పీపుల్స్ వార్ అగ్రనేతలతో ఆయన పని చేశారు. కొండపల్లి సీతారామయ్య, గణపతి, సత్యమూర్తి లకు సహచరుడు రాజిరెడ్డి. ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్య కేసులో రాజిరెడ్డి నిందితుడుగా ఉన్నారు.
2008 జనవరి నెలలో కేరళలో రాజిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని మెట్ పల్లి కోర్టులో హజరుపర్చారు. వివిధ కేసుల్లో నిందితుడుగా రెండున్నరేళ్లు కరీంనగర్ జైలులో ఆయన ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తఫాల్ పూర్ లో నలుగురి హత్య కేసులోనూ ఆయన నిందితుడు. ఉమ్మడి ఏపీలో పీపుల్స్ వార్ చేసిన తొలి హత్య తఫాల్ పూర్ ఘటన. ఆ కేసులో ఏ 1 గా కొండపల్లి సీతారామయ్య, ఏ 2 గా రాజిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, రాజిరెడ్డి కన్నుమూసినట్లు సమచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తమకు అప్పగించాలని కోరుతున్నారు.