Malli Serial Actress Bhavana Lasya: భావన లాస్య అంటే గుర్తుకురావడం కాస్త కష్టమే. కానీ బుల్లితెర మల్లి అంటే మాత్రం స్మాల్ స్క్రీన్ ప్రియులు టక్కున పట్టేస్తారు. స్టార్ మాలో అత్యధిక టీఆర్పీతో దూసుకుపోతున్న సీరియల్స్ లో మల్లి ఒకటి. 2022లో ప్రారంభమైన ఈ సీరియల్ అనతి కాలంలోనే భారీ ప్రజాదరణ సొంతం చేసుకుంది. అలాగే ఈ సీరియల్ లో టైటిల్ పాత్రను పోషిస్తూ తెలుగు రాష్ట్రాల్లో భావన లాస్య సూపర్ పాపులర్ అయింది. తన అందం, అభినయం, ఆకట్టుకునే హావభావాలతో మల్లి పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ దూసుకుపోతోంది.
అయితే నిజానికి నటనపై ఆసక్తి, నటించాలనే ఆశ.. ఇవి రెండు భావన లాస్యకు లేవు. అలాంటి ఆమెకు మల్లి సీరియల్ లో ఛాన్స్ ఎలా వచ్చిందో తెలిస్తే ఖచ్చితంగా షాకైపోతున్నారు. భావన లాస్య స్వస్థలం వైజాగ్. ఆమె తండ్రి రైల్వే ఉద్యోగి కాగా.. తల్లి గృహిణి. చిన్నతనం నుంచి భావన లాస్య ఫోకస్ మొత్తం చదువులపైనే ఉండేది. కెనడాలో ఎంబీఏ చేసి మంచి ఉద్యోగం చేయాలనేది ఆమె డ్రీమ్. కాలేజీ, బుక్స్, ఫ్యామిలీ.. ఇవే ఆమె ప్రపంచం.
అయితే లాక్డౌన్ సమయంలో భావన లాస్య సోషల్ మీడియాలో ఫోటోలు, సరదా వీడియోలు పోస్ట్ చేసేది. అనుకోకుండా వాటిని మల్లి సీరియల్ వాళ్లు చూశారు. కొత్తవారి కోసం వెతుకుతున్న మల్లి సీరియల్ టీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో భావన లాస్య ఫొటోలు, వీడియోలు చూసి ఆడిషన్‌కి రమ్మని పలుమార్లు ఆమెను కాంటాక్ట్ అయ్యారు. కానీ మొదట ఆమె ఇంట్రెస్ట్ చూపలేదు. పదే పదే కాల్ చేయడంలో ఒకసారి వెళ్లి కలుద్దాంలే అనుకుంది. మల్లి అన్నపూర్ణ ప్రొడక్షన్ హౌస్ వాళ్లదని తెలియడంతో ఆమెకు మరింత నమ్మకం కుదిరింది.
ఫైనల్ లో ఓ రోజు ఆడీషన్ లో పాల్గొంది. నటనపై అనుభవమే లేని భావన లాస్య అనూహ్యంగా ఆడీషన్ లో సెలక్ట్ అయింది. వెతుక్కుంటూ ఒక సీరియల్ లో హీరోయిన్ క్యారెక్టర్ రావడంతో తల్లిదండ్రులు కూడా భావన లాస్యను ప్రోత్సహించారు. దాంతో ఆమె వెనకడుగు వేయలేదు. మెల్ల మెల్లగా నటనపై పట్టు సాధిస్తూ మల్లి పాత్రలో ఇమిడిపోయింది. బుల్లితెర ప్రేక్షకుల హృదయాల్లో చోటు దక్కించుకుంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. భావన లాస్య ఓవైపు యాక్టింగ్ కెరీర్ ను సాగిస్తూనే మరోవైపు చదువును సైతం కొనసాగిస్తోంది.