ఏపి అసెంబ్లీలో నాల్గవ రోజు సమావేశాలు ప్రారంభమైయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. విష జ్వరాలు, ఆరోగ్య రంగంలో సంస్కరణలు, ఎన్ఆర్ఈజీఎస్ పనుల వేతన బకాయిలు, భూ పట్టాల పంపిణీ, లేపాక్షి నాలెడ్జ్ పార్క్, నామ నిర్దేశ పదపుల్లో మహిళలకు రిజర్వేషన్లు, ఉచిత ఇళ్ల నిర్మాణం, రాష్ట్రంలో పెట్టుబడులు తదితర అంశాలపై సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానమిస్తున్నారు.

ప్రశ్నోత్తరాల అనంతరం కీలకమైన పెగాసస్ నివేదిక సభ ముందుకు రానుంది. 85 పేజీల ఆధారాలతో సభ ముందుకు నివేదిక పెట్టనుంది హౌస్ కమిటీ. టీడీపీ హయాంలో డేటా చౌర్యం జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన హౌస్ కమిటీ విచారణ జరిపింది. ఈ విచారణ నివేదికను సభ ముందుకు తీసుకురానుంది. తదుపరి ఏడు బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అనంతరం విద్య వైద్యం, నాడు – నేడు పై స్వల్ప కాలిక చర్చ కొనసాగనుంది.
AP Assemblyతొలుత టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ సభకు హజరైయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే ప్రతి రోజు ఏదో ఒక అంశంపై నిరసన వ్యక్తం చేస్తొంది టీడీపీ. అదే విధంగా ఈ రోజు సంక్షోభంలో సంక్షేమం నినాదంతో అసెంబ్లీకి టీడీపీ నేతలు నిరసన ప్రదర్శన గా చేరుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమీపంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేసి ప్రదర్శనగా అసెంబ్లీకి చేరుకున్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో అమలు చేసిన పథకాలన్నింటినీ వైసీపీ సర్కార్ రద్దు చేసిందని వారు ఆరోపించారు. అన్నా క్యాంటిన్, పెళ్లి కానుక, పండుగ కానుకలతో పాటు అంబేద్కర్ విదేశీ విద్యాదీవెన పథకాలను రద్దు చేయడంపై ప్లకార్డులు చేబూని నిరసన ప్రదర్శన నిర్వహించారు.