Chandrababu Arrest: ఏపీ ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్నారు. ఈ విధంగా ఓ ప్రతిపక్ష నాయకుడుని అవినీతి ఆరోపణలతో జైలుకు తరలించడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఇది ప్రధమం కావచ్చు. గతంలో ఇటువంటి ఘటన జరిగిన దాఖలాలు లేవు. పక్కనే ఉన్న తమిళనాడులో అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య కక్షసాధింపు చర్యలు కరుణానిధి, జయలలిత కాలంలో జరిగింది.
అయితే చంద్రబాబుకి శత్రువులు, ప్రత్యర్ధులు ఎవరు అంటే సమాధానం చెప్పడం ఒక విధంగా కష్టమే. ఎందుకంటే.. చంద్రబాబు శతృవుల లిస్ట్ చాలా పెద్దదే కాబట్టి. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు చేసిన రాజకీయాల కారణంగా రాజకీయంగా అనేక మంది శత్రువులు తయారు అయ్యారని అంటుంటారు. ఏపీలో చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నట్లుగానే పాలిటిక్స్ నడుస్తుండటంతో చంద్రబాబుకు ప్రధాన శతృవు, ప్రత్యర్ధి జగన్ యే అని అందరూ అనుకుంటుంటారు. కానీ తెర వెనుక పెద్ద తలకాయలే ఆయనకు శతృవులుగా, ప్రత్యర్ధులుగా ఉన్నారు అనేది జగమెరిగిన సత్యం. అయితే వారు అసలు శతృవులా.. మితృలా అనే తేడా లేకుండా కూడా ఉందని అంటున్నారు.
వాస్తవానికి రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఉండరు. వారి వారి అవసరాలు, అవశ్యకత మేరకు రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటుంటాయి. ఒక నాటి శతృవులు ఇప్పుడు మితృలుగా మారుతుంటారు. చంద్రబాబు ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన తర్వాత యూపీఎతో చేతులు కలిపారు. బీజేపీ అగ్రనేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. అంతే కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తోనూ చంద్రబాబు శతృత్వం పెట్టుకున్నారు. ఆ కారణంగానే 2019 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ ఒటమికి, వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ గెలుపునకు పరోక్షంగా కేంద్రంలోని బీజేపీ పెద్దలు, కేసిఆర్ సహకారం అందించారు అనేది అందరికీ తెలిసిందే.
గతంలో అవినీతి అక్రమాల కేసులో జగన్మోహనరెడ్డి జైలుకు వెళ్లడానికి నాటి కాంగ్రెస్ పెద్దలతో చంద్రబాబు మంతనాలు జరిపారని, తప్పుడు కేసులు నమోదు చేయించడంలో చంద్రబాబు పాత్ర ఉందని వైసీపీ నేతలు గతంలోనూ ఆరోపణలు చేశారు. ఇక ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి సీఎం సీటు, పార్టీని లాక్కున్నారని చంద్రబాబుపై గతం నుండి ఆరోపణ ఉంది. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు బీజేపీ పెద్దలను తీవ్ర స్థాయిలో విమర్శించారు. నాటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వస్తే నల్లబెలూన్లతో నిరసన తెలియజేశారు. ప్రధాని మోడీపైనా వ్యక్తిగత విమర్శలు కూడా చంద్రబాబు చేశారు. అందుకే బీజేపీ పెద్దలు కూడా చంద్రబాబును దూరం పెట్టారని, ఇప్పుడు స్నేహం కోసం పాకులాడుతున్నా వారు స్పందించడం లేదని అంటున్నారు.

చంద్రబాబు అరెస్టు పై దేశ వ్యాప్తంగా పలువురు నేతలు స్పందిస్తూ ఖండన ప్రకటనలు ఇస్తున్నా కేంద్ర బీజేపీ పెద్దలు నోరు మెదపలేదు. అంటే చంద్రబాబు అరెస్టు కేంద్ర పెద్దలకు తెలిసే జరిగి ఉంటుందన్న అనుమానాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై నారా లోకేష్, అచ్చెన్నాయుడు ల వద్ద పలువురు మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ఆ విషయాన్ని బీజేపీ పెద్దలనే అడాలని పేర్కొన్నారు. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే జగన్ కంటే చంద్రబాబు మీద వాళ్లే ఎక్కువగా పగబట్టేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అంటున్నారు.