Chandrababu Arrest: మూలిగే నక్కపై తాటికాయ పడింది అన్నట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి తయారు అయ్యింది. తన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి క్లిష్ట, దురదృష్టకరమైన పరిస్థితిని చంద్రబాబు ఎప్పుడూ ఎదుర్కొని ఉండరు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టు అయిన చంద్రబాబు దాదాపు మూడు వారాలకు పైగా రాజమండ్రి సెంట్ర్లల్ జైల్ లో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ సీఐడీ ఇప్పటికే ఆయనపై పలు కేసులను నమోదు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లోనూ అరెస్టు చూపేందుకు సీఐడీ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ జారీ చేసింది. వీటికి తోడు అంగళ్లు ఘటనకు సంబంధించి హత్యాయత్నం కేసు చంద్రబాబుపై ఉంది. వీటిలో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు న్యాయపోరాటం చేస్తున్నారు.

ఇవి ఇలా ఉండగా, తాజాగా ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి రావడం టీడీపీని కలవరపాటుకు గురి చేస్తొంది. ఓటుకు నోటు కేసులో ఏసీబీకి అడ్డంగా బుక్ అవ్వడం వల్లనే చంద్రబాబు ఆనాడు పదేళ్ల వరకూ హైదరాబాద్ పై హక్కు ఉన్నా రాత్రికి రాత్రే బిషానా సర్దేసి అమరావతికి వచ్చేశారన్న టాక్ అందరికీ తెలిసిందే. ఓటుకు నోటు కేసు నుండి తప్పించుకునేందుకే చంద్రబాబు నాడు హైదరాబాద్ నుండి పారిపోయి వచ్చారని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కేసిఆర్ సర్కార్ ఆ కేసుపై అంతగా సీరియస్ గా తీసుకోకపోవడంతో చంద్రబాబుపై ఓటుకు నోటు కేసు మరుగున పడింది. అయితే ఇప్పుడు స్కిల్ స్కామ్ కేసుతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, అంగళ్లు కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, ఓటుకు నోటు కేసు మరో సారి తెరపైకి రావడం హాట్ టాపిక్ అయ్యింది.

ఓటుకు నోటు కేసును తెలంగాణ ప్రభుత్వం సక్రమంగా విచారించలేదనీ, పూర్తి స్థాయిలో చార్జిషీటు దాఖలు చేయలేదనీ, ఆ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చి సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 4వ తేదీ సుప్రీం కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేయనుంది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. మరో పక్క స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మనీలాండరింగ్ తదితర అభియోగాలు ఉన్నందున సీబీఐ, ఈడీతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ఏపీ హైకోర్టులో విచారణ దశలో ఉంది. ఈ పిటిషన్ కూడా వారంలో విచారణకు వచ్చే అవకాశం ఉంది.

అటు ఉండవల్లి దాఖలు చేసిన పిటిషన్ పై, ఇటు ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ల పై న్యాయస్థానాలు ఏ విధంగా తీర్పు ఇస్తాయో అన్న ఉత్కంఠ కొనసాగుతుంది. మరో పక్క స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ ఈ నెల 3వ తేదీ రానుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబుకు సంబంధించిన కేసులు ఇప్పుడు విజయవాడ ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో నడుస్తుండటంతో తీర్పులు ఎలా వస్తాయా అని టీడీపీ శ్రేణులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. కేసులో అరెస్టు అయి జైల్ కు వెళ్లడంతో సింఫతీ సంగతి ఏమో కానీ బాబోరికి బ్యాడ్ టైమ్ నడుస్తొంది అనే మాట వినబడుతోంది.