Kuppam Bomb Blasat: చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ పేలుడు సంభవించింది. కుప్పం కొత్తపేట పెద్దపల్లి గంగమాంబ ఆలయం వీధిలోని ఓ ఇంట్లో నాటు బాంబు పేలింది. నాటు బాంబుతో పాటు జిలెటిన్ స్టిక్స్ కూడా పేలినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి ఇంటి ముందు భాగం, కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. ఆ ఇంట్లో నివాసం ఉంటున్న మురగేష్, ధనలక్ష్మి దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు పిల్లలకు ముప్పు తప్పింది. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు.

పేలుడు శబ్దంతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. స్థానికుల సమాచారం తో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడుపై ఆరా తీస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి గుమ్మం దగ్గర నాటు బాంబు పేల్చినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. గాయపడిన దంపతులను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే ఈ పేలుడుపై పోలీసులు, స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుప్పంలో ఇళ్ల మధ్యలో ఇలా పేలుడు సంభవించడంతో స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలాన్ని రేపుతోంది.
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే మురుగేష్, ధనలక్ష్మి దంపతులను ఇంటి యజమాని ఖాళీ చేయాలని చాలా కాలంగా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పేలుడు జరగడంతో పలు అనుమానాలకు తావు ఇస్తొంది. అయితే.. దంపతులను టార్గెట్ చేసిన వారే పేలుళ్లకు పాల్పడ్డారా లేక మరో కారణం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Vijaya Sai: కులాల మధ్య, కుటుంబాల మధ్య కుంపట్లు పెడతారంటూ టీడీపీపై విజయసాయి విమర్శలు