Janasena : ఒక్కోసారి రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడే మాటలు, చేసే వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా, చర్చనీయాంశాలుగా మారుతుంటాయి. ఇప్పుడు ఆ వరుసలోకే మెగాస్టార్ megastar చిరంజీవి chiranjeevi పొలిటికల్ రీ ఎంట్రీ వ్యవహారం వచ్చింది. ఇటీవల జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ కు అండగా ఉంటాననీ మెగాస్టార్ చిరంజీవీ స్పష్టమైన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తాను కలిసి ఉన్న సమయంలో పవన్ ను ఉద్దేశించి రెండు మూడు సంవత్సరాలు సినిమాలు చేసుకో ఆ తరువాత ఎప్పుడైనా నీ వెనుక అన్ని విధాలా అండగా ఉంటాను అని పవన్ చిరంజీవి చెప్పారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అయితే ఈ విషయం బయటకు రావడంతో చిరు జనసేన ద్వారా పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు గప్పుమన్నాయి. నాదెండ్ల మనోహర్ కు తోడు బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా జనసేన – బీజెపీలకు మద్దతు ఇస్తానని చిరంజీవి హామీ ఇచ్చారనీ చిరుతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధమని ప్రకటించారు.
త్వరలో జరగనున్న తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన – బీజెపీ ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి గెలుపే లక్ష్యంగా పని చేయాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో చిరు పొలిటికల్ రీఎంట్రీ వార్తలు రావడంతో జనసేన క్యాడర్ లో జోష్ నింపింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తరువాత చిరంజీవి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత పూర్తిగా సినీ రంగానికే పరిమితం అయి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఓ పక్క రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలను, సీఎం వైఎస్ జగన్ వైఖరిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే చిరు..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు. అసలే రాజకీయాలంటే చిరు తీవ్ర విరక్తిగా ఉన్నట్లు సమాచారం. అందుకే తమిళనాట రాజకీయ పార్టీ పెట్టాలని భావిస్తున్న తరుణంలో రజనీకాంత్ కు రాజకీయ పార్టీ వద్దంటూ సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అందరికీ రాజకీయాలు అచ్చిరావనీ, మన లాంటి వాళ్లు రాజకీయాల్లో రాణించడం కష్టమని, ప్రజల్లో అభిమానం ఉండటం వల్ల రాజకీయం చేయడం వేరని రజనీకి చెప్పినట్లు సమాచారం. చిరు మాటలు అంతగా పట్టించుకోని తలైవా రాజకీయ పార్టీకి పెట్టడానికి సిద్ధమైనా తరువాత అనారోగ్య కారణంతో ఆ ప్రతిపాదన విరమించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాలను పక్కన పెడితే ప్రస్తుత పరిస్థితుల్లో చిరు పొలిటికల్ రీ ఎంట్రీ అనేది పుకారేనని అనుకుంటున్నారు. దీనిపై చిరు మాత్రం ఇంత వరకూ స్పందించలేదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి జనసేన – బీజెపీ నేతల కోరిక, అభిమానుల ఆకాంక్షపై చిరు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.