టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై చేస్తున్న విమర్శలకు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై తండ్రీకొడుకులు ఇద్దరూ పిచ్చిపిచ్చినా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వైఎస్ జగన్మోహనరెడ్డిని చంద్రబాబు, లోకేష్ లు వ్యక్తిగతంగా దూషించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కొడాలి. తెలంగాణలో పుట్టి, తెలంగాణలో పెరిగి, అక్కడే చదువుకున్న లోకేష్ ఇక్కడ (ఆంధ్రా) లో యాత్ర చేస్తున్నాడని విమర్శించారు. ఇక్కడ మంగళగిరి కాకుండా అక్కడ తెలంగాణలో ఏదో ఒక నియోజకవర్గం చూసుకుని పోటీ చేస్తే బాగుంటుందన్నారు. లోకేష్ డీఎన్ఎ తెలంగాణది అని అన్నారు.

సీఎం జగన్ డీఎన్ఏ రాయలసీమది కాబట్టి సోనియా గాంధీని ఎదిరించి పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారని అన్నారు. చంద్రబాబు ఎర్రగడ్డ నుండి వచ్చి గోదావరి జిల్లాల్లో పర్యటిస్తూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబు అని విమర్శించారు. నేను బూతులు మాట్లాడతాను అనే వాళ్లకి చంద్రబాబు, లోకేష్ మాట్లాడే భాష వినిపించడం లేదా అని ప్రశ్నించారు కొడాలి నాని. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ప్రాజెక్టులు నిండలేదన్నారు. చంద్రబాబు దండగ అన్న వ్యవసాయాన్ని సీఎం జగన్ పండుగ చేసి చూపించారన్నారు. రెండు ఎకరాల నుండి రెండు వేల ఎకరాలు ఎలా సంపాయించావు అంటూ ప్రశ్నించారు. ఎన్టీఆర్ వారసులు అందరూ సామాన్యుల్లా బ్రతుకుతున్నారని, ఎన్టీఆర్ ఆస్తి అంతా చంద్రబాబుకు పంచి పెట్టారా అని ప్రశ్నించారు. రైతులను మోసం చేసి, పేదలను సర్వనాశనం చేసిన చంద్రబాబు ఓ 420, ఓ అవినీతి చక్రవర్తి అంటూ ఘాటుగా విమర్శించారు.
ఆ కేసులో తెలంగాణ సర్కార్ కు సుప్రీం కోర్టులో భారీ ఊరట