Nara Lokesh: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు నారా లోకేష్ విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. చంద్రబాబును జైల్ నుండి బయటకు తీసుకువచ్చేందుకు న్యాయనిపుణులతో సంప్రదింపులు జరపడంతో పాటు జాతీయ స్థాయిలో నాయకులకు చంద్రబాబు అరెస్టు విషయాన్ని తెలియజేసి వారి మద్దతు కూడగట్టేందుకు లోకేష్ ఢిల్లీ వెళ్లారు. గత పది రోజులుగా ఢిల్లీలోనే లోకేష్ ఉన్నారు. పార్లమెంట్ ఆవరణలో పలువురు ఎంపీలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

అంతకు ముందు జాతీయ మీడియాతోనూ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ జగన్మోహనరెడ్డి సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇవేళ లోకేష్ ఢిల్లీ నుండే చంద్రబాబు అరెస్ట్ అనంతర పరిణామాలపై పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాల నాయకులు, పార్టీ నేతలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ ఎన్ని కుట్రలు పన్నినా చంద్రబాబుపై అవినీతి మరక వేయలేకపోయిందని నేతలు అభిప్రాయపడ్డారు. పార్టీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాలను ప్రభుత్వం పోలీసులతో అణిచివేయడం, కేసులు పెట్టడాన్ని నేతలు తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంలోనే యువగళం పాదయాత్ర పునః ప్రారంభించే అంశంపై పార్టీ నేతలతో లోకేష్ మాట్లాడారు. వచ్చే వారం నుండి యువగళం పాదయాత్ర ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. చంద్రబాబు అరెస్టుతో పాదయాత్ర నిలిచిన ఉమ్మడి గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే యువగళం పాదయాత్ర కొనసాగించనున్నారు. చంద్రబాబు అరెస్టుపై ఓ పక్క న్యాయపోరాటం చేస్తూనే మరో పక్క యువగళం పాదయాత్ర కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు, జగన్ సర్కార్ రాజకీయ కక్ష సాధింపు గురించి ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని, నాయకులు అంతా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
మరో పక్క పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు పార్టీలో కార్యక్రమాల నిర్వహణ కోసం పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమిస్తూ పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజారాపు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, ఎంఏ షరీఫ్, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, నక్కా ఆనంద్ బాబు, కాల్వ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్ధన్ రెడ్డి, వంగలపూడి అనిత, బీద రవీంద్ర లతో పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది.
Chandrababu Arrest: ముగిసిన చంద్రబాబు సీఐడీ కస్టడీ .. చంద్రబాబు రిమాండ్ అక్టోబర్ 5వరకూ పొడిగింపు