Janasena: బీసీ కులాలు అన్నీ కలిస్తే రాజ్యాధికారం ఇంకెవ్వరికీ రాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల అనైక్యతే మిగతా వారికి బలం అని, బీసీలు ముందుగా సాధించాల్సింది ఐక్యత అని స్పష్టం చేశారు. తాను మానవత్వం, జాతీయ భావాలతో పెరిగాననీ, కాకపోతే సమాజంలో ఏఏ కులాలు వెనుకబడి ఉన్నాయో వాటిని భుజాల మీదికి ఎత్తుకోవాలని కంకణం కట్టుకున్నానని తెలిపారు. తాను ఏ ఒక్క కులానికో పరిమితం కాదని అన్నారు. తాను కాపు నాయకుడిని మాత్రమే కాదనీ ప్రజలందరికీ నాయకుడిగా ఉండాలనుకుంటున్నానని వివరించారు. దేహీ అని అడిగితే రాజ్యాధికారం ఎవ్వరూ ఇవ్వరని, రాజ్యాధికారాన్ని పోరాడి సాధించుకోవాల్సిందేనని పిలుపునిచ్చారు. ఓటు అమ్ముకుంటే జీవితకాలం గులాం గిరీ తప్పదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇన్నాళ్లూ బీసీ కులాలు ఎందుకు ఐక్యత సాధించలేకపోయాయో అర్ధం కావడం లేదని అన్నారు.

బీసీ సదస్సు అంటే బీసీ నాయకులు అందరూ వస్తారు కానీ ఒక బీసీ నాయకుడిని ఎన్నికల్లో పోటీకి నిలబడితే మిగతా బీసీలందరూ ఓటేసి ఎందుకు గెలిపించరు అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. బీసీ అంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదనీ, బ్యాక్ బోన్ క్యాస్ట్ అని అన్నారు. బీసీలకు రాజకీయ సాధికారతే కాదు అర్ధిక పరిపుష్టి కావాలన్నారు. పోరాటాలు చేసే సమయంలో బీసీ నేతలంతా ఎలా ఒక్క తాటిపైకి వస్తారో అదే విధంగా ఎన్నికల్లో బీసీ అభ్యర్ధిని నిలబెట్టినప్పుడు కూడా అలానే ఐక్యంగా, బలంగా నిలబడితే మీరు ఇక ఎవరికీ అడగాల్సిన అవసరమే ఉండదని అన్నారు. అప్పుడు మిమ్మల్ని (బీసీ నేతలు) చూస్తే నేను కూడా భయపడతానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మంత్రి బొత్స సత్యనారాయణ పెరిగితే తూర్పు కాపులంతా పెరిగినట్లు కాదని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకే కాకుండా బీసీల కూడా ఉప ప్రణాళికా నిధులు ఉండాలని పేర్కొన్నారు. బీసీలను జగన్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్సించారు.

తాను ఎప్పుడైనా మాట్లాడితే బీసీ నాయకులు, కాపు నేతలతో తిట్టిస్తారనీ, లేకపోతే దళిత నాయకులతో తిట్టిస్తారనీ, దీని వెనుక ఓ మహత్తరమైన వ్యూహం దాగి ఉందని అన్నారు పవన్ కళ్యాణ్. మీలో మీరు కొట్టుకుచావండి అనేదే వారి ఉద్దేమని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపు కాబట్టి బీసీలతో తిట్టిస్తే గ్రామాల స్థాయిలో వాళ్లిద్దరూ కొట్టుకుంటారు ఇదే వాళ్ల స్ట్రాటజీ, దళితులతో తిట్టిస్తే వాళ్లిద్దరూ కొట్టుకుంటారు. కానీ పన్నాగం పన్నిన నాయకులు మాత్రం వారు ఏ పార్టీలో ఉన్నా తిట్టుకోరనీ, ఎంతో మర్యాదగా మాట్లాడుకుంటారని అన్నారు. ఒక వేళ విమర్శించుకున్నా ఎంతో చక్కగా విమర్శించుకుంటారని, బీసీ కులాల నాయకులు అందరూ ఈ విషయం అర్ధం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలంగాణలో 26 కులాలను బీసీ జాబితా నుండి తొలగించారనీ, బీసీ కులల తొలగింపుపై బీఆర్ఎస్ వివరణ ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు.

బీసీల సమస్యల పరిష్కారానికి తాను ఒక రోజు దీక్ష చేయడానికి సిద్దంగా ఉన్నానని పవన్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను నిర్లక్ష్యానికి గురి చేస్తుందన్నారు. మత్స్యకారుల కోసం జనసేన ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వచ్చే పాతికేళ్లలో బీసీల మనుగడ కోసం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. రాజకీయాల్లోకి బీసీ యువత ముందుకు రావాలన్నారు. 2024 ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తామో పార్టీ ఆవిర్భావ సభలో చెబుతానని పవన్ కళ్యాణ్ తెలిపారు. కాగా ఈ సదస్సులో పలువురు వక్తలు బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఇదే క్రమంలో బీసీ నేతలు పవన్ ముందు ఒక డిమాండ్ ను ఉంచారు. టీడీపీ, బీజేపీలను వదిలివేయాలనీ, ఒంటరిగా పోటీ చేయాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆ రెండు పార్టీలను వదిలివేసి వస్తే బీసీలు పార్టీకి అండగా ఉంటారంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ దీనిపై ఏ విధంగానూ స్పందించలేదు.
Delhi Liquor Scam: తొమ్మిది గంటల పాటు సుదీర్ఘంగా కవిత ఈడీ విచారణ ఇలా.. మరో సారి విచారణ ఎప్పుడంటే..?