YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇటీవల ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. అయితే హైకోర్టు ఉత్తర్వులను వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. వివేకా కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని సునీత కోరారు. అవినాష్ పై మోపిన అభియోగాలు అన్నీ తీవ్రమైనవేననీ పిటీషన్ లో ఆమె పేర్కొన్నారు. సీబీఐ మోపిన అభియోగాలను హైకోర్టు సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదని సునీత పేర్కొన్నారు.

హైకోర్టు తీర్పులో కొన్ని లోపాలు ఉన్నాయని కూడా పిటిషన్ లో సునీత పేర్కొన్నారు. అవినాష్ ముందస్తు బెయిల్ ను సీబీఐ వ్యతిరేకిస్తుంది. సునీత పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టులో సీబీఐ వాదనలు వినిపించనున్నది. రేపు సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు వస్తావించే అవకాశం ఉంది. వైఎస్ వివేకా కేసులో నిందితులకు వ్యతిరేకంగా సునీతా రెడ్డి ఇంతకు ముందు పలు మార్లు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపైనా సునీతా రెడ్డి సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన తర్వాతనే ఆయన బెయిల్ రద్దు అయ్యింది.