వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండలం అలవలపాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఈతకు వెళ్లిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. వేముల మండలం వేల్పుల గ్రామానికి చెందిన జ్ఞానయ్య (25), అలవపాడుకు చెందిన సాయి సుశాంత్ (8), సాయి తేజ (11)లు గాలేరు నగరి సుజల స్రవంతి కెనాల్ సమీపంలో జీఎన్ఎన్ కాలువలో పడి మృతి చెందారు. గ్రామస్తులు వారి మృతదేహాలను వెలికి తీశారు.

విషయంలోకి వెళితే.. సుశాంత్, సాయి తేజ తల్లి మృతి చెందడంతో అలవలపాడులోని అమ్మమ్మ ఇంటి వద్దనే ఉంటున్నారు. బంధువు జ్ఞానయ్య ఈస్టర్ పండుగకు వీరి ఇంటికి వచ్చాడు. కాగా ఆదివారం ఆ పిల్లల మేనమామ శశికుమార్ తో కలిసి వారు కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లారు. కాలువలో లోతు ఎక్కువగా ఉండటంతో శశికుమార్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. అయితే మిగిలిన ముగ్గురు ఈదుకుంటూ ఒడ్డుకురాలేక నీట మునిగి మృతి చెందారు.
గ్రామస్తులు ఈ సమాచారాన్ని వేంపల్లి పోలీసులకు తెలియజేశారు. ఎస్ఐ తిరుపాల్ నాయక్ ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో అలవపాడులో విషాదశ్చాయలు అలుముకున్నాయి.