Sreeleela: టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. పెళ్లి సందడితో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఫస్ట్ మూవీతోనే భారీ క్రేజ్ సంపాదించుకుంది. గత ఏడాదిన్నర కాలం నుంచి కెరీర్ ను జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టించింది. 2023 లో శ్రీలీల నుండి ఏకంగా నాలుగు చిత్రాలు వచ్చాయి. అయితే అందులో భగవంత్ కేసరి మినహా.. మిగిలిన స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. శ్రీలీల గ్రాఫ్ డౌన్ అయ్యేలా చేశారు.
ఇక ఈ ఏడాదిని శ్రీలీల గుంటూరు కారం మూవీతో ప్రారంభించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు జోడీగా శ్రీలీల నటించింది. భారీ అంచనాల నడుమ సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం మూవీ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. అయితే టాక్ యావరేజ్‌గా ఉన్నా ఫెస్టివల్ అడ్వాంటేజ్ తో ఈ చిత్రం గట్టెక్కేసింది. ఇదిలా ఉండగా.. గుంటూరు కారం తర్వాత సినిమాల ఎంపికలో శ్రీలీల మునుపటి జోరును చూపించలేకపోతోంది.
ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ తో సహా ఒకట్రెండు చిత్రాలు ఉన్నాయి. అవి కూడా గతంలో ఎప్పుడో ఒప్పుకున్నావే. రీసెంట్ టైమ్ లో శ్రీలీల ఒక్క కొత్త ప్రాజెక్ట్ కు కూడా సైన్ చేయలేదు. దీంతో శ్రీలీల కెరీర్ క్లోజ్ అనే టాక్ మొదలైంది. ఇలాంటి తరుణంలో ఆమె చెంతకు ఈ బిగ్ ప్రాజెక్ట్ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఓ సినిమా చేసేందుకు శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు `గుడ్ బ్యాడ్ అగ్లి`. మార్క్ ఆంటోనీ’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా చేయబోతున్నాడు.
మైత్రీ వారు మార్చిలో ఈ బైలింగ్వల్ మూవీని అనౌన్స్ చేశారు. జూన్ లో గుడ్ బ్యాడ్ అగ్లి షూటింగ్ ప్రారంభం కాబోతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. త్వరలోనే పట్టాలెక్కబోయే గుడ్ బ్యాడ్ అగ్లి చిత్రంలో అజిత్ కుమార్ కు జోడీగా శ్రీలీల ఎంపిక అయిందని కోలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయట. శ్రీలీల ఎంపికపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందని టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయం పట్ల అభిమానులు మరియు కొందరు సినీ ప్రియులు విమర్శలు కురిపిస్తున్నారు. అజిత్-శ్రీలీల మధ్య ఉన్న ఏజ్ గ్యాపే ఇందుకు కారణం. శ్రీలీల కంటే అజిత్ 30 ఏళ్లు పెద్దవాడు. ఈ నేపథ్యంలోనే అజిత్ వంటి సీనియర్ హీరో పక్కన శ్రీలీల అస్సలు సెట్ కాదని.. స్క్రీన్ పై వీరిద్దరూ తండ్రీకూతుళ్లుగా కనిపిస్తారని అభిప్రాయపడుతున్నారు. తండ్రి వయసున్న హీరోతో శ్రీలీల రొమాన్స్ చేస్తే చూడలేమని అంటున్నారు. అసలే అజిత్ గత కొన్నేళ్ల నుంచి ఏజ్ దాచుకోకుండా తెల్ల గడ్డంతో తనకు సూటయ్యే పాత్రలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఆయన పక్కన నయనతార, త్రిష, అనుష్క వంటి సీనియర్ హీరోయిన్లే తప్పా యంగ్ బ్యూటీలు సెట్ అవ్వరు. అటువంటి అజిత్ కుమార్ కు జోడీగా శ్రీలీల చేయడమంటే పెద్ద రిస్కే.