Hello Brother: అక్కినేని మన్మధుడు, టాలీవుడ్ కింగ్ నాగార్జున తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం హలో బ్రదర్. అటు క్లాస్, ఇటు మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన హలో బ్రదర్ మూవీ విడుదలై తాజాగా 30 ఏళ్ళను పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా హలో బ్రదర్ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. దిగ్గజ దర్శకుడు దివంగత ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన యాక్షన్ కామెడీ మూవీనే హలో బ్రదర్.
ఇ.వి.వి. సత్యనారాయణ, నాగార్జున కాంబినేషన్ లో అంతకు ముందు వారసుడు సినిమా వచ్చింది. వారసుడు మంచి విజయం సాధించినప్పటికీ.. క్రెడిట్ మాత్రం సూపర్ స్టార్ కృష్ణగారికి దక్కింది. వారసుడు తర్వాత ఇ.వి.వి కి నాగార్జున మరో అవకాశం ఇచ్చారు. దాంతో మంచి లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా చేద్దామని ఇ.వి.వి సత్యనారాయణ భావించారు. కానీ నాగార్జున అందుకు మొగ్గు చూపలేదు. దాంతో బాగా ఆలోచించిన ఇ.వి.వి ఐడెంటికల్ ట్విన్స్ కాన్సెప్ట్ తో సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు.
హాంకాంగ్ యాక్షన్ కామెడీ డ్రామా అయిన `ట్విన్ డ్రాగన్స్` స్పూర్తితో హలో బ్రదర్ స్క్రిప్ట్ తయారు చేశారు. అయితే ఇంచుమించు హలో బ్రదర్ స్టోరీతోనే రెండు మూడేళ్ల క్రితం చిరంజీవి రౌడీ అల్లుడు మూవీ చేశాడు. అందువల్ల హలో బ్రదర్ ప్రాజెక్టు చర్చల దశలో ఉండగా ఎన్నో విమర్శలు వచ్చాయి. అప్పటికింకా ఇ.వి.వి గారికి అగ్రహీరోలతో వర్క్ చేసి అనుభవనం లేదు. పైగా రొటీన్ స్టోరీతో హలో బ్రదర్ తీసేందుకు రెడీ అవుతున్నారు. కచ్చితంగా సినిమా ఫ్లాప్ అవుతుందని దాదాపు అందరూ భావించారు. ఇండస్ట్రీలో చాలా మంది నాగార్జునకి ఫోన్ చేసి మరీ హలో బ్రదర్ నుంచి తప్పుకోమని సూచన చేశారట. ఈ జాబితాలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు.
కానీ నాగార్జున మాత్రం వెనకడుగు వేయలేదు. ఇ.వి.వి గారిపై గట్టి నమ్మకంతో హలో బ్రదర్ చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఇందులో సౌందర్య, రమ్యకృష్ణు హీరోయిన్లుగా నటించారు. తమిళ నటుడు నెపోలియన్ విలన్ గా చేశాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్ నారాయణ నిర్మించిన ఈ చిత్రానికి రాజ్ – కోటి స్వరాలు అందించారు. 1994 ఏప్రిల్ 20న విడుదలైన హలో బ్రదర్ చిత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. క్లాస్ మరియు మాస్ క్యారెక్టర్స్ లో వేరియేషన్స్ చూపిస్తూ నాగార్జున అదరగొట్టేశారు.
ఇ.వి.వి గారి స్క్రీన్ ప్లే, కథాంశం, కామెడీ మరియు లాక్ ట్రాక్, సౌందర్య-రమ్యకృష్ణ గ్లామర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి. సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హలో బ్రదర్ లోని ప్రతి సాంగ్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా కన్నె పెట్టారో, ప్రియా రాగాలే సాంగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇద్దరు నాగార్జునలు ఒకేసారి తెరపై కనిపించే సన్నివేశాలు ఈ చిత్రంలో కొన్ని ఉన్నాయి. ఆ సీన్లలో నాగార్జునకు డూప్ లో ఇ.వి.వి గారి ప్రియమైన శిష్యుడు, ప్రముఖ హీరో శ్రీకాంత్ నటించడం మరొక విశేషం. అంతేకాకుండా హలో బ్రదర్ సినిమా 70 కేంద్రాల్లో 50 రోజులు, 24 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. ఫుల్ రన్ లో బాక్సాఫీస్ వద్ద రూ. 15.25 కోట్ల రేంజ్ లో వసూళ్లను సొంతం చేసుకుంది. 1994లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా హలో బ్రదర్ రికార్డు సెట్ చేసింది.