Balakrishna: తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా, ఏపీ రాజకీయాల్లో సక్సెస్ ఫుల్ పొలిటీషన్ గా సత్తా చాటుతున్న వారిలో నటసింహం నందమూరి బాలకృష్ణ ఒకరు. అయితే తాజాగా బాలయ్య కుటుంబ ఆస్తుల లెక్కలు బయటకు వచ్చాయి. టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా హిందూపురం నుంచి మూడోసారి బాలకృష్ణ రంగంలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు ఆ నియోజకవర్గంలో నుంచి బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో కూడా విజయకేతనం ఎగరవేసి హ్యాట్రిక్ కొట్టేందుకు బాలయ్య సిద్ధం అవుతున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేషన్ల పర్వం జోరందుకుంది. తాజాగా బాలకృష్ణ కూడా నామినేషన్ వేశారు. శుక్రవారం హిందూపురంలోని ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పాత్రలు అందజేశారు. నామినేషన్ పాత్రల్లో బాలయ్య తన ఆస్తులు మరియు అప్పులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆ వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నామినేషన్ పాత్రల్లో తెలిపిన వివరాల ప్రకారం.. బాలకృష్ణ పేరిట రూ. 81.63 కోట్లు విలువ చేసే ఆస్తులు మరియు రూ. 9 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. అలాగే బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి పేరిట 140 కోట్ల 38 లక్షల 83 వేలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. బాలయ్య కంటే ఆయన భార్య వసుంధర ఆస్తులే ఎక్కువగా కావడం విశేషం. ఇక బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఆస్తుల విలువ 58 కోట్ల 63 లక్షల 66 వేలు ఉన్నట్టు వివరాలు సమర్పించారు. ఈ లెక్కన బాలకృష్ణ కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ. 465.35 కోట్లు.
కాగా, బాలకృష్ణ ఫిల్మ్ కెరీర్ విషయానికి వస్తే.. అఖండ మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన ఆయన గత ఏడాది వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ మరో రెండు హిట్స్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ తన 109వ చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో చేస్తున్నాడు. NBK109 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ప్రారంభం అయింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
యానిమల్ మూవీతో భారీ క్రేజ్ సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. వీరమాస్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పటికే నిర్మాత సూర్యదేవర నాగవంశీ టైటిల్ ను రిజిస్టర్ కూడా చేయించారనే టాక్ ఉంది. హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2024 చివర్లో బాలకృష్ణ, బాబీ సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.