చంద్రబాబు కి అస్సలంటే అస్సలు ఇష్టం లేదు .. కానీ వాళ్ళంతా బలవంతపెడుతుంటే పాపం !

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు ఊహించ‌ని షాక్‌లు త‌గులుతున్నాయి.

ఇటు ఏపీలో ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అన్న‌ట్లుగా ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పస్తూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. ఇలా ఏపీలోనే ఇర‌కాటంలో ప‌డుతున్న స‌మ‌యంలో తెలంగాణ‌లో ఇంకో ఇబ్బంది ఎదుర‌వుతుంద‌ని అంటున్నారు. అదే పార్టీ స‌త్తా చాటేందుకు ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని తెలుగుదేశం పార్టీ నేత‌లు డిమాండ్ చేస్తున్నార‌ట‌. అదే శాస‌న‌మండలి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం.

ఎప్పుడు ఎన్నిక‌లంటే…

వచ్చే ఏడాది మార్చిలో వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్‌‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్‌‌ ఎమ్మెల్సీ రామచంద్రరావు పదవీకాలం ముగుస్తుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు కార్యక్రమం అక్టోబర్ ఫస్ట్ నుంచి మొదలవుతోంది. వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానానికి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. గత రెండు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, ఓటర్ల జాబితాను ముందు వేసుకుని ఆశావహులు కుస్తీ పడుతున్నారు. పట్టభద్రుల ఎన్నిక గురించి మొదట్లో అంతగా ఆసక్తి లేకపోయినప్పటికీ గత రెండు ఎన్నికల్లో ఓటర్ల ఆలోచన విధానంలో భారీ తేడా కనిపించింది. దీంతో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అప్పుడే మొద‌ల‌యింది

ఎన్నికలు జరగడానికి కనీసం మూడు నాలుగు నెలల ముందు నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. కొత్త ఓటరు నమోదుకు షెడ్యూల్ జారీ చేయడం, దరఖాస్తుల స్వీకరణ, వాటి పరిశీలన చేయాల్సి ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ లేదా అక్టోబర్ మొదటి వారంలో ఓటరు నమోదుకు సంబంధించి నోటీసులు జారీ చేస్తామని జిల్లా ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అయితే దీనికంటే ముందుగానే ఆశావహులు గత ఎన్నికల్లో జరిగిన తీరుతెన్నులు, ఓటర్ల జాబితా వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటికే పలువురు ఆశావహులు ఓటర్లను ఫోన్లో సంప్రదించడంతో పాటు, పలుచోట్ల వివిధ సంఘాల ప్రతినిధులతో మీటింగ్లు ఏర్పాటు చేసి వారి వాయిస్ వినిపిస్తున్నారు.

తెలంగాణ టీడీపీ జోష్‌…

శాస‌న‌మండ‌లి ఎన్నిక‌ల విష‌యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత‌లు సైతం గురి పెట్టార‌ట‌.
రాష్ట్రంలో త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలపై కొంద‌రు టీడీపీ నేత‌లు ఆశతో ఉన్నార‌ట‌. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ సీటుతో పాటు వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానంలో గెలుపు అవ‌కాశాలు ఉన్నాయ‌ని భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు ఎల్‌. ర‌మ‌ణ సైతం బ‌రిలో నిలిచేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. టీజేఎస్ అధ్య‌క్షుడు కోదండ‌రాం పోటీ చేసే చోట కాకుండా టీడీపీ నేత‌ల‌ను బ‌రిలో దింపాల‌ని చూస్తున్నార‌ని స‌మాచారం. ఈ పోటీపై తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుకు ఆస‌క్తి లేకున్నా ర‌మ‌ణ ఒత్తిడితో ఓకే అంటున్నార‌ని చెప్తున్నారు.

బీజేపీ ఇప్ప‌టికే రెడీ

హైదరాబాద్ సిట్టింగ్ సీటును తిరిగి గెలుచుకోవడంతో పాటు వరంగల్ ఎమ్మెల్సీ సీటునూ తమ ఖాతాలో వేసుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. పార్టీ తరపున క్యాండిడేట్ల ఎంపిక, ప్రచారం ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి తిరిగి రాంచందర్‌‌రావునే బరిలో నిలిపే ఆలోచనతో ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ నేత మల్లారెడ్డి సైతం టికెట్ కోసం పట్టుబడుతున్నా సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచందర్‌‌రావు వైపే పార్టీ రాష్ట్ర, జాతీయ కమిటీ మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.