సీబీఐ బృందంపై నిందితుడి కుటుంబం దాడి

నోయిడా: అవినీతికి పాల్పడిన ఓ అధికారిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సీబీఐ అధికారుల బృందంపై నిందితుడి కుటుంబసభ్యులు దాడి చేశారు. వారి దాడిలో పలువురు సీబీఐ అధికారులకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో చోటు చేసుకుంది. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

‘లంచం తీసుకున్న కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు సీబీఐ బృందం అతని నివాసానికి వెళ్లింది. అతని కుటుంబసభ్యులు సీబీఐ బృందంపై దాడి చేశారు. ఈ కేసులో కొందరిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిపై చర్యలు తీసుకుంటాం’అని గ్రేటర్ నోయిడా ఎస్పీ వినీత్ కుమార్ సింగ్ తెలిపారు.

సీబీఐలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ విధులు నిర్వహిస్తున్న సునీల్ దత్ లంచం తీసుకోవడంతో అతనిపై అవినీతి కేసు నమోదైంది. ఈ క్రమంలో అతడిని అదుపులోకి తీసుకునేందుకు ఆరుగురు సభ్యుల సీబీఐ బృందం గ్రేటర్ నోయిడాలోని సోనెపురా గ్రామానికి వెళ్లింది. అయితే, నిందితుడు ఓ ఫాంహౌస్‌లో దాక్కున్నట్లు సమాచారం రావడంతో అక్కడి వెళ్లింది సీబీఐ అధికారుల బృందం.

అక్కడే ఉన్న దత్ కుటుంబసభ్యులు.. సీబీఐ అధికారులు రాగానే వారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ సమయంలోనే నిందితుడు సునీల్ దత్ అక్కడ్నుంచి పారిపోయాడు. కాగా, దాడిలో పలువురు సీబీఐ అధికారులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేశారు.

ఇక సునీల్ దత్ అవినీతి కేసు విషయానికొస్తే.. రూ. 126కోట్ల గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వే ల్యాండ్ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ఈ కేసులో లంచం తీసుకున్నాడనే ఆరోపణలతో సీబీఐ అధికారి అయిన సునీల్ దత్‌పై కేసు నమోదు చేసింది. ఫిబ్రవరి 2న దత్‌పై కేసు నమోదు చేయగా.. అప్పట్నుంచి అతడు పరారీలోనే ఉన్నాడు. కాగా, అవినీతి కేసులో మరో సీబీఐ అధికారి వీస్ రాథోడ్, తహసీల్దార్ రణ్ వీర్ సింగ్‌లను సీబీఐ అరెస్ట్ చేసింది.