రైతు సమస్యల పరిష్కారానికి జైకిసాన్ పేరుతో జనసేన కార్యక్రమం

 

తుఫాను, వరదల కారణంగా నష్టపోయిన ప్రతిరైతుకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా గురువారం తిరుపతికి వచ్చిన పవన్ కళ్యాణ్ విహార్ హోటల్‌ లో మీడియాతో మాట్లాడారు. పంట నష్టంపై జనసేన ఆధ్వర్యంలో ఒక నివేదిక తయారు చేసి సాయం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతామన్నారు. కౌలు రైతులకు అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ అన్నారు. పంట నష్టం జరిగిన ప్రతి రైతుకు కనీసం రూ.35 వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని విమర్శించారు. రైతాంగ సమస్యలపై జై కిసాన్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. రైతులకు అండగా నిలిచేందుకు ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.

బీజెపీ సర్కార్ తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాన్ని పవన్ సమర్థించారు. గత వారం రోజులుగా హర్యానా, పంజాబ్ రైతులు ఛలో ఢిల్లీ పిలుపుతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై పవన్ మాట్లాడుతూ రైతుల మేలు కోసమే కేంద్రంలోని బీజెపీ ఈ చట్టం తీసుకువచ్చిందని పవన్ అన్నారు. ఈ చట్టం రైతులకు ఎంతగానో మేలు జరుగుతుందని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యవసాయ రంగంలో సంస్కరణల బీజం వేశారని అన్నారు. రైతుల కిసాన్ బిల్లులో సవరణలు తేవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. కొంత మంది కావాలని ఈ చట్టంపై రాద్దాంతం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగ్రేటంపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపైనా పవన్ స్పందించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగితిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. తొలుత పలువురు రైతులు సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు.