ప్లేట్ ఫిరాయించిన రాందేవ్

 

మధురై (తమిళనాడు), డిసెంబర్ 26: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో ఎదురుదెబ్బ కారణంగా బిజెపిలో ప్రధాని మోదీ పలుకుబడి మసకబారిందా అన్న చర్చ మొదలయిన వేళ బాబా రాందేవ్ కూడా ప్లేటు ఫిరాయించారు. 2014 ఎన్నికలలో మోదీకి గట్టి అండగా నిలిచిన రాందేవ్ రానున్న ప్రధాని కూడా మోదీయేనని చెప్పడానికి నిరాకరించారు. 2019 ఎన్నికల్లో  ప్రధాని ఎవరు అవుతారు అని ప్రశ్నించినపుడు, యోగా గురువు రాందేవ్ బాబా ఇప్పడే ఏమీ చెప్పలేము, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అగమ్యగోచరంగా ఉన్నాయి అని అన్నారు. మధురైలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

2014 ఎన్నికల సమయంలో బారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించడంతో పాటు ఎన్నికల ప్రచారం కూడా చేసిన రాందేవ్ నేడు భారతదేశంలో రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా ఉన్నాయంటూనే తాను రాజకీయాలపై దృష్టి పెట్టడం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేనని, ఏ పార్టీని వ్యతిరేకించనని స్పష్టం చేశారు.  52 ఏళ్లుగా బీజేపీతో దగ్గరి సంబంధం కలిగి ఉన్న రాందేవ్ హర్యానాలో క్యాబినెట్ స్టేటస్ కూడా అనుభవించారు. నేడు ఆయన బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లుగా కానీ వ్యతిరేకిస్తున్నట్లుగా కానీ స్పష్టంగా వెల్లడించకుండా యోగా, వేద పద్ధతుల  ద్వారా అధ్యాత్మిక భారతదేశంగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు.