తిరుపతికి సమీపంలో కొనసాగుతున్న వాయుగుండం.

 

చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో వాయుగుండం కొనసాగుతోందని వాతావరణ తెలిపింది. తిరుపతికి ఉత్తరంగా 35 కిలో మీటర్లు, నెల్లూరుకు నైరుతిగా 70 కిలో మీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని వెల్లడించింది. కొద్ది గంటల్లో మరింతగా బలహీనపడి అల్పపీడనంగా మారనుందని తెలియజేసింది.

వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్, రాయలసీమ జిల్లాల్లో గంటకు 45 నుండి 55 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

నివర్ తుఫాను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపింది. నివర్ తుఫాను ప్రభావంతో బుధవారం రాత్రి నుండి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో పలు జిల్లాల్లో పరిస్థితి దారుణంగా మారింది. జనజీవనం స్తంభించిపోయింది. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెన్నా, కుందూ, స్వర్ణముఖి నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.  భారీ ఈదురు గాలులకు పలు ప్రదేశాలలో చెట్లు పడిపోయాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి సహాయ చర్యలను నిర్వహిస్తున్నది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజానీకాన్ని పునరావాస కేంద్రాలకు తరలించారు.