శ్రీకాకుళం జిల్లా పొందూరు తహసీల్దార్ తామరాపల్లి రామకృష్ణను అసభ్య పదజాలంతో దూషించారన్న అభియోగంపై టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్‌పై కేసు నమోదయ్యింది. ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం రవికుమార్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే అర్ధరాత్రే రవికుమార్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
రెండు రోజుల క్రితం బదిలీపై వెళ్లిన పొందూరు తహసీల్దార్ రామకృష్ణను టీడీపీ నేత, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ బెదిరించారు. ఈ నెల 16న గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో రవికుమార్ సోదరుడికి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లతో మట్టిని అక్రమంగా తవ్వుతుండగా వీఆర్ఓ నుంచి ఫిర్యాదు రావడంతో తహసీల్దార్ అక్కడకు చేరుకుని వాహనాలను సీజ్ చేశారు. దీంతో రవికుమార్ తహసీల్దార్‌కు ఫోన్ చేసి బెదిరించారు. ఆ ఆడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘వాహనాలు విడిచిపెట్టు.. లేకపోతే లంచం డిమాండ్ చేశావని నీ మీద కంప్లైంట్ చేస్తాను’ అని కూన రవికుమార్ తహసీల్దార్ ను దుర్భాషలాడుతూ బెదిరించారు. కాగా కూన రవికుమార్‌పై ఉద్యోగ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశాయి.