ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. చైనాలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ దాదాపు 213 దేశాలకు విస్తరించింది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాలు గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి. నేటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 20,628,118 మంది కరోనా బారిన పడగా, ఏడు లక్షల 48వేల 128మంది మృతి చెందారు. 13,526,647మంది చికిత్స అనంతరం కోలుకొని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. అమెరికా, బ్రెజిల్, రష్యాలతో పాటు మన దేశంలోనూ కరోనా తీవ్రతరంగా నే ఉన్నది. ఈ నేపథ్యంలో కరోనా పూర్తి స్థాయి అదుపునకు వాక్సిన్ ఎప్పుడు వస్తుందా ప్రపంచ దేశాలు అన్నీ ఎదురు చూస్తున్నాయి. వివిధ దేశాల్లో వాక్సిన్ పై ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ తరుణంలో రష్యా ముందుగా వాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రకటించడం శుభ పరిణామమే అయినప్పటికీ పూర్తి స్థాయి క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకుండానే వాక్సిన్ విడుదల చేయడంపై పలు దేశాలలోని శాస్త్రవేత్తల నుండి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

టీకాపై అనుమానాలు ఎన్నో
రష్యా విడుదల చేసిన కరోనా టీకాపై భారత్ తో సహా పలు దేశాల శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ కి సంబందించిన క్లినికల్ ట్రయల్స్ తీరు, డేటా పారదర్శకంగా లేకపోవడం వల్ల ఈ టీకాను విశ్వసించలేమని పూణే లోని ఐఐఎస్ఈఆర్ రోగనిరోధక శాస్త్రవేత్త వినీతా బాల్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం టీకా క్లినికల్ ట్రయల్స్ మూడు దశలు పూర్తి కావాల్సి ఉండగా రష్యా రెండవ దశ పరీక్షలతోనే టీకా విడుదల చేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యా టీకా ఎంత వరకు భద్రమో, దాని పనితీరు ఏమిటో స్పష్టత లేదని, ఆదేశ ఆరోగ్య సిబ్బందిని, ప్రజలను ప్రమాదంలోకి నెడుతోందని అన్నారు అమెరికాకు చెందిన ప్రొఫిసర్ ఫ్లోరియన్ శ్రామర్. అయితే ఈ టీకాపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ దాదాపు 20 రాష్ట్రాల నుండి వంద కోట్ల డోసులకు ఆర్డర్లు వచ్చాయి. ఈ విషయాన్ని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ చీఫ్ డిమిట్రిన్ వెల్లడించారు. కోవిడ్ 19కి విరుగుడుగా వాక్సిన్ తీసుకువచ్చినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ మంగళవారం అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. టీకాను తన కుమార్తె వేయించుకున్నదని కూడా పుతిన్ చెప్పారు. అయితే అయనకు ఇద్దరు కుమార్తె లు ఉండగా పెద్ద కుమార్తె కు వేయించారా, చిన్న కుమార్తె వేయించుకున్నదా అనే విషయాన్ని వెల్లడించలేదు.