అంటే కరోనా వాక్సిన్ జనాలకు ఉచితంగా పడాలి అంటే ఎన్నికలు రావాలన్నమాట..! ఆ హామీలు ఇచ్చిన పార్టీలు గెలవాలన్నమాట..!! ఇదే బీహార్ లో బీజేపీ చెప్పింది, తమిళనాడులో అన్నా డీఎంకే చెప్పింది.., ఇంకెందుకు ఆలస్యం.., తర్వాత మమతా చెప్తుంది, నితీష్ చెప్తారు. ఆశ్చర్యం అవసరం లేదు. వాక్సిన్ తో పాటూ కరోనా మందులు, ఇన్సూరెన్స్ కూడా ఫ్రీగా చేయిస్తాం అన్నా అంటారేమో..! కాలం బ్రదరూ, ఇది కరోనా కాలం..! రాజకీయం బ్రదరూ, ఇది కరోనా టీకా రాజకీయం..!!
బాధ్యత మరిచిన బీజేపీ..!!
బీజేపీ పూర్తిగా బాధ్యత మర్చిపోయింది. ఎన్నికలు, గెలుపు, రాష్ట్రాల్లో కుర్చీలు, కేంద్రంలో పెద్ద కుర్చీ మాత్రమే వారి కళ్ళకు కనిపిస్తుంటాయి. అందుకే రాజకీయం కోసం ఎలా అయినా చేస్తుంది, ఏమైనా చేస్తుంది. కరోనా దేశాన్ని పీడిస్తుంటే..! కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బీహార్ లో ఇచ్చిన ఎన్నికల హామీ వింటే ఆ పార్టీపై జుగుప్స పుట్టడం ఖాయం. “బీహార్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకాలు వేయిస్తుందట”..! అంటే
* కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రాణాంతక వైరస్ విషయంలో ఓట్లు, ఎన్నికలు, గెలుపు అనేది చూడవచ్చా..? అంటే బీహార్ లో గెలిపిస్తే ఆ రాష్ట్రంలో టీకా ఉచితంగా వేసి, మిగిలిన రాష్ట్రాల్లో డబ్బులిస్తేనే వేస్తారా..?
* అసలు కరోనా టీకా గురించి ప్రపంచ వ్యాప్తంగా ఒక స్పష్టత రాని సమయంలో… ఎన్నికల్లో గెలిచినా మూడు వారాల్లో కరోనా టీకా వేయిస్తామని బీజేపీ ఎలా హామీ ఇవ్వగలదు..? అంటే నవంబరు పదో తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చేస్తాయి. అక్కడికి మూడు వారాల్లో కరోనా టీకా సిద్ధమైపోతుందా..?
* బీహార్ లో ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, టీకా వేస్తారు సరే… మరి ఇప్పట్లో ఎన్నికలు లేని ఇతర రాష్ట్రాల సంగతి ఏంటి..? ఈ రాష్ట్రాల్లో పేదోళ్లకు కరోనా టీకా ఉచితంగా రావాలంటే ఎన్నికలు రావాల్సిందేనా..? “వహ్వా..! బీజేపీ రాజకీయం. మొదట మొదలు పెట్టింది బీజేపీ, దాన్ని కొనసాగిస్తూ తమిళనాడులో అదే తరహా హామీ ఇచ్చింది అన్నా డీఎంకే.!
మహమ్మారి ముంగిట మాయా హామీలు..!!
ఎన్నికలంటే గాలి మాటలు, గాలి హామీలు సహజమే. అందులో బీజేపీ ఆరితేరింది. 2014 సాధారణ ఎన్నికల నుండి బీజేపీ అనేక హామీలు ఇస్తూ.., అనేక మాటలు చెప్తూ నెట్టుకొస్తోంది. ఇక తాజాగా బీహార్ లో ఇటువంటి ఎత్తు వేసింది. కరోనాకి టీకా ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎక్కడ తయారవుతుందో తెలియదు. ఓ వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మరో రెండేళ్లు కష్టమే అంటుంది. అటువంటి దశలో కేంద్రంలో పెద్దన్నగా ఉండాల్సిన బీజేపీ రాష్ట్రస్థాయిలో ఇలా సిల్లీ హామీలు, సిల్లీ రాజకీయాలు చేయడం ఏమనుకోవాలి..! “రాజకీయం బ్రదరూ..! ఇది బీజేపీ వారి టీకా రాజకీయం..!!