దీక్ష చేయాలంటే అధికారంలో ఉండాలా!

విజయవాడ, డిసెంబర్ 29: అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పట్ల సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులను అర్ధరాత్రి టెర్రరిస్టుల మాదిరిగా అరెస్టు చేసి తీసుకువెళ్లడం దారుణమన్నారు. పోలీసులను ప్రయోగించి అక్రమంగా నిర్బంధిస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు  పోలీసులను అడ్డుపెట్టుకొని పాలన సాగిస్తున్నారు, కరెంటు తీసేసి..ధీక్షా శిబిరాన్ని భగ్నం చేస్తారా అన్నారు. చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు ఏ దీక్షలైనా చేయవచ్చా అని ప్రశ్నించారు. సాయంత్రంలోగా ప్రభుత్వం అగ్రిగోల్డ్‌పై స్పందించకుంటే రాష్ట్ర  వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో అగ్రిగోల్డ్ బాధితులు చంద్రబాబుకి తగిన గుణపాఠం నేర్పుతారు. నాలుగేళ్లుగా ఈ సమస్యను ప్రభుత్వం నానుస్తుందని అన్నారు. అస్తులు ఉన్నా, బకాయిలు ఎందుకు చెల్లించలేకపోతున్నారని రామకృష్ణ ప్రశ్నించారు.