బీజేపీలోకి రేవంత్ రెడ్డి… ఎందుకో తెలుసా?

తెలంగాణ రాజ‌కీయాల్లోని ఫైర్ బ్రాండ్ నేత‌ల్లో ఒక‌రైన రేవంత్ రెడ్డి త‌న‌దైన రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌తో వార్త‌ల్లో నిలిచే సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆయ‌న నాయ‌క‌త్వంలోని టీఆర్ఎస్ పార్టీపై రేవంత్ రెడ్డి విరుచుకుప‌డుతుంటారు.

దానికి అడ‌పాద‌డ‌పా టీఆర్ఎస్ నేత‌లు సైతం కౌంట‌ర్లు ఇస్తుంటారు. అయితే, తాజాగా కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ మాత్రం రేవంత్ గురించి ఓ రేంజ్‌లో రియాక్ట‌య్యారు. అంతేకాకుండా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ రెడ్డిని ప్రజలెవరూ పట్టించుకోవడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు.

బీజేపీ నేత‌ల తీరు దారుణం

మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. సీఎం కుర్చీకి విలువ ఇవ్వకుండా కేసీఆర్ పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘బీజేపీ సంస్కారం లేని పార్టీ. సీఎం చైర్ ను గౌరవించే సంస్కారం లేదు. సీఎంను కొందరు లీడర్లు ఎలా పడితే అలా విమ‌ర్శిస్తున్నారు. మేం బూతు పురాణం మొదలు పెడితే ఎవర్నీ వదలం. కేంద్ర మంత్రులు, ప్రధానిని కూడా విమ‌ర్శిస్తాం. ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడండి’’ అని వార్నింగ్ ఇచ్చారు.

బీజేపీలోకి రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డిపై ఈ సంద‌ర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో రేవంత్‌రెడ్డి అసలు లీడరే కాదన్నారు. రేవంత్‌ ఒకప్పుడు టీడీపీ.. ఇప్పుడు కాంగ్రెస్‌.. రేపోమాపో బీజేపీలోకి పోతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు తమతో టచ్ లో ఉన్నారని కేటీఆర్ అన్నారు. ఆ పార్టీకి మిగిలేది గుండు సున్న అని ఎగతాళి చేశారు. ‘‘ఆ పార్టీ లీడర్లు తలో దిక్కు చూస్తున్నారు. కొందరు మా పార్టీలోకి వచ్చేందుకు.. మరికొందరు బీజేపీ వైపు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సమర్థులైన నాయకులను టీఆర్ఎస్ లో చేర్చుకోవడం తప్పేమి కాదు” అని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోందని కేటీఆర్ అన్నారు. మొదట్నించి వివిధ పార్టీలు మారిన చరిత్ర రేవంత్ కు ఉందని గుర్తుచేశారు. ‘‘ఆయనో లీడరా.. పొలిటికల్ కామెంటేటర్​గా మారాడు కదా. అనుకోకుండా ఎంపీగా గెలిచారు. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ పని ఖతమ్’’ అని విమర్శించారు. కాంగ్రెస్‌ నేతలు త్వరలోనే పార్టీలు మారతారని తేల్చిచెప్పారు. దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో గ‌తంలో కంటే రెట్టింపు మెజార్టీతో విజ‌యం సాధిస్తామ‌ని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

దుబ్బాక మాదే…

దుబ్బాక బై ఎలక్షన్​లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా దక్కవని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుపై వీసమెత్తు అనుమానం లేదని, గతంలో కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసలు తమకు ప్రత్యర్థులే లేరని అన్నారు. ‘‘దుబ్బాక సీటు మాది. మాది మేం సంపాదించుకుంటాం. మా అభ్యర్థిపై ఎలాంటి మచ్చ లేదు. ఎలాంటి కేసులు లేవు” అని అన్నారు.