సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇవేళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసిఆర్, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ ను కలవడం హాట్ టాపిక్ అయ్యింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరుపై కొద్ది రోజుల క్రితం బాహాటంగానే విమర్శలు చేసిన జగ్గారెడ్డి..సీఎం కేసిఆర్ ను కలవడంతో పాటు ప్రగతి భవన్ లో మరో సారి కలిసేందుకు సమయం ఇవ్వాలని కూడా కోరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. అయితే తాను తన నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబందించి ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి కేటిఆర్ ను కలిసి వినతి పత్రం సమర్పించానని చెప్పారు జగ్గారెడ్డి.

మెట్రో రైల్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట వరకూ విస్తరించాలని, దళిత బంధు తమ నియోజకవర్గంలోని దళితులకు ఇవ్వాలని కోరడంతో పాటు అనేక సమస్యలు వారి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు జగ్గారెడ్డి. తాను చెప్పిన సమస్యలపై సీఎం కేసిఆర్ వెంటనే సానుకూలంగా స్పందించి అందుబాటులో ఉన్న అధికారులను పిలిచి తాను ఇచ్చిన వినతి పత్రంలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారని తెలిపారు. ఇదే సందర్భంలో మీడియా వద్ద కీలక వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. తాను సీఎం, మంత్రిని కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి మోడీని తమ పార్టీ ఎంపీలు కలిసినప్పుడు లేని తప్పు తాను నియోజకవర్గ పనుల కోసం సీఎం కేసిఆర్ ను కలిస్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పాదయాత్ర పూర్తయిన మరుసటి రోజే తనను కోవర్ట్ అంటూ ముద్ర వేశారనీ, ఇప్పుడు కొత్తగా తాను బద్నామ్ అయ్యేది ఏముందని అన్నారు జగ్గారెడ్డి.