Telangana Election 2023: తెలంగాణలో నేటితో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ ను దారికి తెచ్చుకోవడంలో సఫలం అయ్యింది. పలు నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి భంగపడిన సీనియర్ నేతలు స్వతంత్రులుగా బరిలో ఉండేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్ధులుగా వారు బరిలో ఉంటే కాంగ్రెస్ అభ్యర్ధికి తీవ్రంగా మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

దీంతో అసంతృప్తులను బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. వారితో చర్చలు జరిపారు. బరిలో నుండి తప్పుకున్న నేతలకు డీసీసీ అధ్యక్ష పదవుల హామీ ఇచ్చారు. అలానే మరి కొందరికి పార్లమెంట్ సీటు హామీ ఇవ్వడం, మరి కొంత మందికి ఎమ్మెల్సీ, కార్పోరేషన్ చైర్మన్ పదవులు హామీ లభించడంతో కాంగ్రెస్ రెబల్ అభ్యర్ధులు పోటీ నుండి తప్పుకున్నారు. పోటీ నుండి కాంగ్రెస్ అభ్యర్ధులు తప్పుకోవడంతో ఆయా నియోజకవర్గాల అభ్యర్ధులు ఊపిరిపీల్చుకున్నారు. హస్తం పార్టీకి భారీ ఉపశమనం లభించినట్లు అయ్యింది.
సూర్యపేటలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్ధి పటేల్ రమేష్ రెడ్డి నివాసానికి ఏఐసీసీ నేతలు రోహిత్ రెడ్డి, మల్లు రవి తదితరులు వెళ్లి చర్చలు జరిపారు. ఈ సందర్భంలో రమేష్ రెడ్డి కుటుంబ సభ్యులు తమ ఆవేదనను పార్టీ నేతలకు వ్యక్తం చేశారు. ప్రస్తుతం నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నందున రాబోయే లోక్ సభ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ టికెట్ ఇస్తామని రమేష్ రెడ్డికి పార్టీ నేతలు హామీ ఇచ్చారు. ఈ నెల 17న రాహుల్ గాంధీ, ఖర్గేతో కలిపిస్తామని హామీ ఇచ్చారు.
నామినేషన్లు ఉపసంహరించుకున్న కాంగ్రెస్ రెబల్స్ నేతలు
సూర్యాపేట నుండి పటేల్ రమేష్ రెడ్డి, జుక్కల్ నుండి గంగారం, బాన్సువాడ నుండి బాలరాజు, డోర్నకల్ నుండి నెహ్రూ నాయక్, వరంగల్లు వెస్ట్ నుండి జంగా రాఘవరెడ్డి, ఇబ్రహీంపట్నం నుండి దండెం రాంరెడ్డి లు పోటీ నుండి వెనక్కి తగ్గారు.
YS Jagan: నాడు తండ్రి మాట .. నేడు జగన్ నోట
Balakrishna: వాళ్ళు నన్ను తాత అంటే ఒప్పుకోనుగా.. నాకు అస్సలు నచ్చదుగా: బాలకృష్ణ