Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో మరో సారి ఎదురుదెబ్బ తగిలింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో తక్షణ ఊరట లభించలేదు. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. స్కిల్ కేసులో నిధుల దుర్వినియోగం ఆరోపణలతో సీఐడీ నమోదు చేసిన కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరుకు నిరాకరిస్తూ బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు హైకోర్టులో నిన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రధాన పిటిషన్ పై విచారణ తేలే వరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ లో కోరారు. రాజకీయ ప్రతీకారంతో తనను ఈ కేసులో ఇరికించారని చంద్రబాబు తన పిటిషన్ లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత అకస్మాత్తుగా తన పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఇప్పటికే తనను పోలీసు కస్టడీలోకి తీసుకుని సీఐడీ రెండు రోజుల పాటు విచారించిందని పేర్కొన్నారు. మరో అయిదు రోజులు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసిన విషయాని గుర్తు చేశారు.

కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం లేదని ఏసీబీ కోర్టు చెప్పిందన్నారు. ఇప్పటికే ఈ కేసులో సాక్ష్యాధారాలను దర్యాప్తు సంస్థ సేకరించిందని అన్నారు. తమ వాదనను పరిగణలోకి తీసుకోకుండా ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టేసిందని పేర్కొన్నారు. ప్రజా జీవతంలో ఉన్నాననీ.. చట్టాన్ని గౌరవించే వ్యక్తిననీ, దర్యాప్తునకు సహకరిస్తానని, కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటాననీ పేర్కొంటూ.. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ లో చంద్రబాబు కోరారు.
మరో పక్క ఫైబర్ నెట్ కేసులో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ పై ఇవేళ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. సీఐడీ తరపు న్యాయవాది నిన్న పీటీ వారెంట్ పై వాదనలు వినిపించారు. వాదనలు కొనసాగించేందుకు ఏసీబీ కోర్టు సమ్మతి వ్యక్తం చేసింది. ఈ రోజు మద్యాహ్నం 2.30 గంటలకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సీఐడీ వాదనలు విననున్నారు. వాదనల అనంతరం ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని వెల్లడించనున్నది.
Breaking: కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసిన నారా లోకేష్