Operation Ajay Israel: ఇజ్రాయెల్-హమాస్ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతోంది. రెండు దేశాల్లోనూ వందలాది మంది చనిపోతున్నారు. వేలమంది గాయపడ్డారు. ఇజ్రాయేల్ గడ్డపై హమాస్ ఆకస్మిక దాడి, ముష్కరులు ఇళ్లలోకి చొరబడి పౌరులను హతమార్చడంతో బెంజిమిన్ నెతన్యాహు సర్కారు యుద్ధం ప్రకటించింది. యుద్ధాన్ని నిర్వహించడానికి అత్యవసర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హమాస్ అధీనంలోని గాజా స్ట్రిప్‌పై భారీ బాంబు దాడులతో ఇజ్రాయేల్ విరుచుకుపడుతోంది. ప్రతీకార దాడులతో గత ఐదు రోజులుగా వేలాది మంది మరణించారు. గాజాను ఇజ్రాయేల్ బలగాలు చుట్టుముట్టాయి.

మరోవైపు, దాదాపు 150 మంది పౌరులను హమాస్ బందీలుగా పట్టుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. వారిలో కనీసం 14 మంది థాయ్‌లు, ఇద్దరు మెక్సికన్లు, పెద్ద సంఖ్యలో అమెరికన్లు, జర్మన్లు ఉన్నారు. ఇదే సమయంలో లెబనాన్‌తో ఉత్తర సరిహద్దులో ఇరాన్-మద్దతుగల షియా మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా నుంచి కూడా ఇజ్రాయేల్ ముప్పును ఎదుర్కొంది.
పరిస్థితి త్వరగా విశ్లేషించి ఇజ్రాయెల్ నుండి భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభిస్తున్నట్లు విదేశాంగ మంత్రి డా. జైశంకర్ తెలిపారు. ఇజ్రాయిల్ లో మొత్తం 18000 మందికి పైగా భారతీయులున్నారు. భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి ప్రత్యేక విమానాల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. నేడు ఇజ్రాయిల్ నుంచి భారతీయులకు తరలింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతీ భారతీయుని భద్రతా తమకు ఎంతో ముఖ్యం అని కూడా జయశంకర్ అన్నారు. వారు భారత్ చేరిన అనంతరం వారి వారి ఇళ్లకు చేరుకునే విధంగా ప్లాన్ వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా భద్రత ఏర్పాట్లు పూర్తి చేసారు.
Launching #OperationAjay to facilitate the return from Israel of our citizens who wish to return.
Special charter flights and other arrangements being put in place.
Fully committed to the safety and well-being of our nationals abroad.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 11, 2023
గాజాపై వైమానిక దాడితో పాటు, ఇజ్రాయెల్ సైన్యం కూడా గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇజ్రాయెల్ సైనికులు గాజా సరిహద్దులోకి ప్రవేశించారు . ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం చాలా రోజులు కొనసాగే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
పరిస్థితిని వేగంగా అంచనా వేసిన భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ నుండి తిరిగి రావాలనుకునే భారతీయులు మన దేశానికి తిరిగి రావడానికి వీలుగా ఆపరేషన్ అజయ్ కోసం ప్రత్యేక విమానాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్న తీరును పలువురు హర్షిస్తున్నారు. .ఆపరేషన్ అజయిని ప్రకటించే ముందు, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ యుఎఇ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా పశ్చిమాసియా సంక్షోభంపై ఇరుదేశాల నేతలు చర్చించారు. జైశంకర్ తన యుఎఇ కౌంటర్‌తో ఫోన్‌లో మాట్లాడారు . ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య యుద్ధం తర్వాత భారతదేశంతో చర్చలు జరిపిన మొదటి అరబ్ దేశం UAE కావడం గమనార్హం.
ఇజ్రాయెల్‌లో కొన్ని వేల మంది భారతీయ పౌరులు అక్కడ పనిచేస్తున్నారు.. అదే సమయంలో ఇజ్రాయెల్‌లో భారీ సంఖ్యలో విద్యార్థులు కూడా ఉన్నారు. స్వదేశానికి వచ్చేందుకు పేర్లు నమోదు చేసుకున్నవారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని, వారిని తీసుకొచ్చేందుకు తొలి ప్రత్యేక విమానం గురువారం అందుబాటులో ఉంటుందని ఇజ్రాయేల్‌లోని భారత రాయబార కార్యాలయం మరొక పోస్ట్‌లో తెలిపింది. ‘ప్రత్యేక విమానం కోసం నమోదు చేసుకున్న భారతీయ పౌరులు చాలా మందికి ఇ-మెయిల్ పంపాం… తదుపరి విమానాల కోసం ఇతర నమోదిత వ్యక్తులకు సమాచారం ఇస్తాం’ అని పేర్కొంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం అప్పుడు కూడా భారత ప్రభుత్వం అక్కడ చిక్కుకున్న విద్యార్థులను, ఇతర పౌరులను ప్రత్యేక విమానాలలో తరలించిన సంగతి తెలిసిందే.

Operation Ajay Toll Free Numbers: ఆపరేషన్ అజయ్ కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సహాయ సదుపాయాల ఢిల్లీ కంట్రోల్ రూమ్ నంబర్లు: 1800118797 (toll-free), 91-11 23012113, 91-11-23014104, 91-11-23017905 and 919968291988, e-mail ID: [email protected].