బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో టీడీపీ నేత చంద్రబాబు మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది. శనివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు .. రాత్రి 8 గంటల ప్రాంతంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసానికి వెళ్లారు. అదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అమిత్ షా నివాసానికి చేరుకున్నారు. ఇద్దరు కీలక నేతలతో చంద్రబాబు సమావేశమైయ్యారు. ముందు చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రైవేటు కార్యక్రమం అని పార్టీ వర్గాలు తెలిపినప్పటికీ అమిత్ షా, జేపి నడ్డాలతో చంద్రబాబు భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. వీరి భేటీ సుమారు 40 నిమిషాల పాటు సాగింది. తాజా రాజకీయ పరిణామాలుతో పాటు ఇతర అంశాలపై నేతలు చర్చించినట్లు సమాచారం.

అయిదేళ్ల తర్వాత అమిత్ షాతో చంద్రబాబు
ఎన్డీఏ నుండి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత అమిత్ షాతో చంద్రబాబు భేటీ కావడం ఇదే ప్రధమం. 2019 ఎన్నికల తర్వాత ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమయంలో ఒక సారి ప్రధాని మోడీని చంద్రబాబు కలిశారు. ఆ తర్వాత జీ 20 సన్నాహాక సదస్సుకు హజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లినప్పుడు మరో సారి భేటీ అయ్యారు. ఈ రెండు అధికారిక కార్యక్రమాలు కావడంతో రాజకీయ ప్రాధాన్యత లేదు. కానీ ఈ సారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ అగ్రనేత అమిత్ షాతో సమావేశం కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతున్న వేళ చంద్రబాబు బీజేపీ అగ్రనేతలతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

కొద్ది నెలల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర బీజేపీ పెద్దలను కలిసి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ సిద్దంగా లేదన్నట్లు వార్తలు వచ్చాయి. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు గానూ బీజేపీ కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు పేర్కొన్నారు. అయితే కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ అంచనాలు మారినట్లుగా చెబుతున్నారు. రాబోయే ఎన్నికల నాటికి ఏపిలో ఏదో ఒక ప్రధాన పార్టీతో బీజేపీ పొత్తుతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో తొలుత వైసీపీతో పొత్తు అంశంపై బీజేపీ చర్చించినట్లుగా వార్తలు వచ్చాయి. బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకుంటే మైనార్టీ ఓటింగ్ మైనస్ అవుతుందని వైసీపీ భావిస్తొంది. అవసరమైతే ఇంటర్నల్ గా కేంద్రంలోకి బీజేపీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి సిద్దమే కానీ బహిరంగ పొత్తునకు వైసీపీ అంగీకరించే అవకాశం ఉండదు. చంద్రబాబు మాత్రం గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో బీజేపీ తో స్నేహా హస్తానికి సముఖంగా ఉన్నాయి. ఇటీవల ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు చంద్రబాబు. ఆ తర్వాత అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు సమావేశం కావడంతో మరల ఎన్డీఏలో కలవడానికే అన్న ఊహగానాలు ఊపందుకుంటున్నాయి. దీనిపై త్వరలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
PM Modi Visit Train Accident Site: బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన ప్రధాని మోడీ