ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపై ఎన్నికలకు ముందు జరిగిన హత్యాయత్నం కేసు విచారణ ఎట్టకేలకు ఎన్ఐఏ కోర్టులో నేటి నుండి ప్రారంభమైంది. ఘటన జరిగిన నాలుగేళ్లకు ట్రయల్ కు వచ్చింది. ఈ నేపథ్యంలో కోడి కత్తితో దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనును పోలీసులు విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు హజరుపర్చారు. నేటి విచారణకు హజరు కావాలని ప్రత్యక్ష సాక్షి విశాఖ ఎయిర్ పోర్టు అసిస్టెంట్ దినేష్ కుమార్ కు నోటీసులు జారీ కాగా ఆయన గైర్హజరు అయ్యారు. ఆయన తండ్రి మరణించడంతో కోర్టుకు హజరుకాలేదని దినేష్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 15కి వాయిదా వేసింది కోర్టు. తదుపరి విచారణకు బాధితుడు సీఎం జగన్ కూడా విచారణ కు హజరు కావాలని ఎన్ఐఏ కేరోటు ఆదేశాలు జారీ చేసింది.

2018 లో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వైఎస్ జగన్మోహనరెడ్డి ఉత్తరాంధ్ర లో పాదయాత్ర చేస్తూ, హైదరాబాద్ కు వెళ్లేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టు వీఐపీ లాంజ్ లో జగన్ ఉండగా, అక్కడ హోటల్ లో వెయిటర్ గా పని చేస్తున్న శ్రీను సెల్పీ తీసుకుంటానని వచ్చి కోడి కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలోనే జగన్ భుజానికి గాయమైంది. ఈ కేసు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకి అప్పగించారు. ఈ దాడి కేసులో మొదటి ముద్దాయిగా జనిపల్లి శ్రీనివాసరావును పేర్కొన్నారు. 2019 లోనే ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది.