Janasena: ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాగించాలంటే నిధులు కావాల్సిందే. అందుకోసం విరాళాలను రాజకీయ పార్టీలు సేకరిస్తూ ఉంటాయి. పారిశ్రామిక వేత్తలు, పరిశ్రమలు, పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు, ఆశావహుల నుండి విరాళాలు సేకరిస్తూ ఉంటాయి. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కూడా ఎన్నికల ఖర్చు కోసం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. వన్ డే ఫర్ జనసేన పేరుతో విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టింది. అయితే ఇంత వరకూ ఎంత మొత్తంలో విరాళాలు వచ్చాయో జనసేన ప్రకటించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఈ నెల రెండో తేదీన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకను అభిమానులు ఘనంగా నిర్వహించారు.

చిత్ర సీమలో అగ్రహీరోగా పవన్ కళ్యాణ్ కు పెద్ద సంఖ్యలో అభిమానులు, అలాగే జనసేన పార్టీగా భారీగా కార్యకర్తల బలం ఉంది. అయితే గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి మాట్లాడారు. ఇతర పార్టీల మాదిరిగా డబ్బు పంపిణీ చేసే సంస్కృతికి జనసేన వ్యతిరేకమని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. అయితే ఎన్నికల్లో రాటు దేలిన తర్వాత రాజకీయాల్లో డబ్బులేనిదే ఏమీ చేయలేమనే వాస్తవాన్ని తర్వాత తెలుసుకున్నట్లు ఉన్నారు. ఆ క్రమంలోనే పలు నియోజకవర్గాలకు ఇన్ చార్జి బాధ్యతలకు అంగ బలం, అర్ధబలం ఉన్న వాళ్లనే జనసేన ఎంపిక చేస్తొంది. మరో పక్క పార్టీ కోసం ఖర్చు పెట్టుకోకతప్పదని పవన్ బహిరంగంగానే ప్రకటించారు. పార్టీని నడపడం కోసం తాను సినిమాల్లో నటిస్తున్నాననీ, తనకు సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పార్టీ కోసం ఖర్చు పెడుతున్నానని కూడా చెప్పారు.

రీసెంట్ కు జనసేన పార్టీ కోసం కార్యకర్తలు, నేతలు ముందుకు వచ్చి నిధుల సేకరణకు పెద్ద ఎత్తున ప్రచారానికి తెరలేపారు. మన పార్టీ – మన బాధ్యత అంటూ జనసేనను అభిమానించే ఉద్యోగులు తమ ఒక్క రోజు వేతనాన్ని విరాళం అందించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వన్ డే శాలరీ ఫర్ జనసేన నినాదంతో విరాళాల సేకరణ ఉద్యమాన్ని నడిపారు. 2019 లో పవన్ జన్మదినాన్ని పురస్కరించుకుని 33 వేల మంది విరాళాలు ఇచ్చారు. అప్పట్లో ఆ విరాళాల గురించి పవన్ మాట్లాడటాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే .. పార్టీ కోసం అభిమానంతో విరాళాలు సేకరించడం తప్పేమి కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా విరాళాలు సేకరిస్తుంది. అయితే పారదర్శకతకు పెద్దపీట వేస్తామని చెప్పే జనసేన నాయకులు విరాళాల రూపంలో ఎంత వచ్చిందో ప్రకటించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. పార్టీకి వచ్చిన విరాళాలను బట్టి ఆ పార్టీకి ఎంత మేర ఆదరణ ఉందో చెప్పవచ్చనే కామెంట్స్ ప్రత్యర్ధుల నుండి వినబడుతున్నాయి. జనసేన విరాళాలు సేకరించే విషయం లో పవన్ కళ్యాణ్ అడ్డంగా ఇరుక్కున్నారని ప్రత్యర్ధుల విమర్శగా ఉంది.

ప్రత్యర్ధుల విమర్శలను జనసేన అభిమానులు కొట్టిపారేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన షూటింగ్ ల ద్వారా వచ్చిన ఆదాయంతో రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా జనసేన కౌలు రైతు భరోసా పేరిట ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష వంతున ఆర్దిక సాయం అందించారని చెబుతున్నారు. ప్రభుత్వం నుండి సాయం అందకపోయినా తమ పార్టీ అధినేత అందించారని అంటున్నారు.