Vijaya Sai Reddy: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ తరుణంలోనే చంద్రబాబుపై మరో మూడు కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుల్లో బెయిల్ పొందేందుకు చంద్రబాబు తరపున పేరు మోసిన న్యాయవాదులు పలు కోర్టుల్లో ఏసీబీ కోర్టు మొదలు కొని సుప్రీం కోర్టు వరకూ వాదనలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి ..పెండింగ్ కేసుల భారంతో ఒత్తిడితో ఉన్న కోర్టులకు చంద్రబాబు తలనొప్పిలా మారాడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయాన్ని ఓడించడానికి నారా ఫ్యామిలీ కోట్ల రూపాయలను వెదజల్లుతోందని విమర్శించారు.

న్యాయాన్ని ఓడించడానికి ఓ పక్క కోట్లు వెదజల్లుతూ, పేరు మోసిన లాయర్లతో పిటిషన్ల మీద పిటిషన్లు వేయిస్తూ మరో పక్క న్యాయం గెలవాలని ఆందోళన చేయడం వింతే కదా అని పేర్కొన్నారు. మీ దృష్టిలో న్యాయం, ధర్మం, నిజాయితీ అంటే అర్ధం ఏమిటి పురందేశ్వరి అంటూ ప్రశ్నించారు. వేల కోట్ల స్కాములకు పాల్పడిన చంద్రబాబు పై కేసులు పెట్టడం అన్యాయమా అని ప్రశ్నించారు. ట్రయల్ కోర్టు నుండి సుప్రీం కోర్టు వరకూ 50కి పైగా పిటిషన్లు చంద్రబాబు లాయర్లు వేశారన్నారు. వాటిని కొట్టేసినా, వాయిదా వేసినా మరికొన్ని పిటిషన్లు పడుతున్నాయన్నారు.
ఏ కోర్టును ఏం అభ్యర్ధిస్తున్నారో వాళ్లకే తెలియనంత గందరగోళ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. పెండింగ్ కేసుల భారంతో ఉన్న కోర్టులకు ఈయనో తలనొప్పిగా మారాడనీ, న్యాయ వ్యవస్థ ఇదంతా గమనిస్తూనే ఉందని అన్నారు. గత కొన్నాళ్లుగా విజయసాయి రెడ్డి .. చంద్రబాబు, లోకేష్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి టార్గెట్ గానూ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తున్నారు.