టాలీవుడ్ లో తెలుగమ్మాయిలకి అవకాశం రావడం చాలా అరుదుగా జరుగుతుంది. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ముంబై మోడల్స్ లేదా ఢిల్లీ డాల్స్ ని తెచ్చుకోవడం మేకర్స్ కి ఎప్పటి నుంచో అలవాటైపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఒక తెలుగమ్మాయి టాలీవుడ్ లో అడుగుపెట్టింది. తనే ప్రియాంక జవాల్కర్. విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాతో ఈ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీలో ఎంటరయింది. మొదటి సినిమా..అందులో విజయ్ దేవరకొండ లాంటి యంగ్ అండ్ పాపులర్ హీరో..యువి క్రియోషన్స్, గీతా ఆర్ట్స్ లాంటి రెండు పెద్ద నిర్మాణ సంస్థలు…ఇన్ని కలిసొచ్చే అంశాలున్న టాక్సీవాలా లో అవకాశం వచ్చిందనగానే ఇక ఆ హీరోయిన్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందని ఎవరైనా ఫిక్స్ అవుతారు.
అంతేకాదు మిగతా మేకర్స్ కూడా ఆ హీరోయిన్ మీద ఓ కన్నేసి తమ ప్రాజెక్ట్ లో సూటవుతుందంటే అడ్వాన్స్ ఇచ్చి డేట్స్ లాక్ చేసుకుంటారు. ఇక్కడ ప్రియాంక జవాల్కర్ కూడా అదే ఆశపడింది. టాక్సీవాలా రిలీజయ్యాక వరసగా ఇంటర్వ్యూలు ఇచ్చింది. కాని మళ్ళీ ఒక్క సినిమాలో కూడా అవకాశం రాలేదు. వాస్తవంగా ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్ బాగానే పర్ఫార్మ్ చేసింది. ప్రేక్షకులు కూడా ఆదరించారు. ఎటొచ్చి మేకర్స్ కే ఈ బ్యూటి సూటవలేదు.
దీంతో ఎలాగైనా మరో సినిమాలో ఛాన్స్ దక్కించుకోవాలని ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫొటోలతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. తన అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు విపరీతంగా ఫాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంది. మరి ఇప్పుడున్న పరిస్థితులు ప్రియాంక కి అనుకూలించి నిర్మాతల మనసులో ప్రియాంక జవాల్కర్ పేరు గనక మెదిలితే ఖచ్చితంగా అవకాశం రావచ్చు. ఈసారి మరో సినిమా అవకాశం వస్తే మాత్రం ఇక వరసగా సినిమాలు దక్కించుకునేందుకు రెడీగా ఉందట. ఈ ఒక్క హీరోయిన్ మాత్రమే కాదు నాని గ్యాంగ్ లీడర్ తో టాలీవుడ్ కి వచ్చిన ప్రియాంక అరుల్ మోహన్, నాగ చైతన్య సమంత నటించిన మజిలీ సినిమాతో టాలీవుడ్ కి వచ్చిన దివ్యాంశ కౌషిక్ ల పరిస్థితి కూడా ఇలానే ఉంది.